Cyclones: తుఫాన్లకు పేర్లు ఎవరు పెడతారు..? ఎన్నో ఆసక్తికర విషయాలు

మిచౌంగ్ తుఫాను ప్రభావం చూస్తే క్రమంగా బీభత్సం సృష్టిస్తోంది. సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి..

Update: 2023-12-04 14:29 GMT

మిచౌంగ్ తుఫాను ప్రభావం చూస్తే క్రమంగా బీభత్సం సృష్టిస్తోంది. సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. తుఫాను కారణంగా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. చెన్నైతో పాటు ఏపీని భయభ్రాంతులకు గురి చేస్తోంది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో భారీ వర్షం కురుస్తుంది. తీర ప్రాంతంలో హై అలర్ట్ ను ప్రకటించారు అధికారులు. అయితే తుఫాన్లు ఏర్పడుతుంటాయనే విషయం అందరికీ తెలిసిందే. తుఫాన్లు వచ్చినప్పుడు అవి బీభత్సం సృష్టిస్తుంటాయి. ఈ తుఫాన్ల కారణంగా ఒక్కోసారి ఎంతో ప్రాణ నష్టంతో పాటు ఆస్తినష్టం కూడా సంభవిస్తుంటుంది. అయితే తుఫాన్‌ వచ్చినప్పుడల్లా వారి పేర్లను చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటాయి. తుఫాన్లకు రకరకాలుగా నామకరణం చేస్తుంటారు వాతావరణ శాఖ అధికారులు. మరి ఆ పేర్లు ఎలా పెడతారు.. ఎందుకు పెడతారు.. ? ఎవరు పెడతారు అనే అనుమానం మీకెప్పుడైన వచ్చిందా..? వచ్చినా పెద్దగా పట్టించుకోము. తుఫాన్లకు పేర్లు పెట్టడం వెనుక పెద్ద కారణమే ఉంటుంది.

ప్రపంచవాతావరణ శాఖతోపాటు ఆర్థిక, సామాజిక కమిషన్ ఆసియా, పసిఫిక్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆరు వాతావరణ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటితోపాటు ఐదు ప్రాంతీయ ఉష్ణమండల తుఫాను హెచ్చరికల కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలు తుఫాన్ల హెచ్చరికలు, సూచనలు చేస్తుంటాయి. అలాగే వీటి పేర్లను కూడా ఈ కేంద్రాలే పెడుతుంటాయి. ఈ ఆరు ప్రాంతీయ కేంద్రాల్లో ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్‌మెంట్(ఐఎండీ) కూడా ఒకటి. 13 సభ్య దేశాలకు చెందిన తుఫానులకు చెందిన సమాచారం అందించడం ఈ డిపార్ట్‌మెంట్‌ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం వస్తోన్న తుఫానుకు ''మిచౌంగ్'' అనే నామకరణం చేశారు అధికారులు.

తుపాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయన్ని 2000 సంవత్సరంలో యునైటెడ్‌ నేషన్స్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్ కమిషన్‌ ఫర్‌ ఏసియా అండ్‌ పసిఫిక్‌, ఇంకా వరల్డ్‌ మెట్రలాజికల్‌ ఆర్గనైజేషన్‌ సంయుక్తంగా ప్రారంభించాయి. అప్పటి నుంచి ఈ తుఫాన్లకు పేర్లు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భారత్‌, బంగ్లాదేశ్‌, మాల్దీవులు, ఒమన్‌, మయన్మార్‌, పాకిస్థాన్‌, థాయ్‌లాండ్‌, శ్రీలంక దేశాలు ఉన్నాయి. అయితే ఒక్కోదేశం 13 పేర్లతో ఒక జాబితాను సిద్ధం చేసింది. బంగాళాఖాతంలో, అరేబియా సముద్రాలలో ఏర్పడే ఈ తుఫాన్లకు ఈ పేర్లను పెడుతుంటారు.

తుఫాన్లకు పేర్లను పెట్టడంపై ఒప్పందం:

ఇదిలా ఉండగా.. వాతావరణం శాఖ వివరాల ప్రకారం.. 2000వ సంవత్సరంలో 27వ సదస్సును మస్కట్‌, ఓమన్‌దేశాల్లో నిర్వహించారు. ఇందులో తుఫాన్లకు పేర్లను పెట్టడంపై ఒప్పందం జరిగింది. ఇక పలుమార్లు సభ్యదేశాల మధ్య కీలక చర్చలు జరిగాయి.ఆ తర్వాత 2004 సెప్టెంబరులో తుఫానులకు నామకరణం చేయడం ప్రారంభమైంది. అయితే బంగాళాఖాతం, అరేబియన్‌ సముద్రాల తీరంలో ఉన్న ఎనిమిది దేశాలను ముందుగా గుర్తించారు. ఇంగ్లీష్‌లోని ఆల్ఫబెటిక్ ఆర్డర్ ప్రకారం వీటిని ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాలను పొందుపర్చారు.

ఢిల్లీలోని వాతావరణ కేంద్రం కొన్ని పేర్లను ముందుగానే..

అయితే ఢిల్లీలోని వాతావరణ కేంద్రం కొన్ని పేర్లను ముందుగానే నిర్ణయిస్తుంటుంది. అయితే రానున్న తుఫానుకు ఒక పేరును సూచించాలని సభ్యదేశాలు కోరుతుంది. ఇది అరేబియా సముద్రం, బంగాళాఖాతం తీరంలో ఉన్న సభ్య దేశాలకు పంపుతుంది. తుఫానులకు పేర్లుపెట్టడం వల్ల అధికారులు, శాస్త్రవేత్తలు, విపత్తుల నిర్వహణ శాఖ, మీడియాతోపాటు సామాన్య ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఒకే ప్రాంతంలో ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ తుఫానులు సంభవిస్తే వాటి మధ్య తేడా, ప్రభావాలను గుర్తించేందుకు ఈ పేర్లు ఉపయోగపడతాయని తెలుస్తోంది. తుఫాన్లకు పేరు పెట్టే సంస్కృతికి అమెరికా తెరపైకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

హిందూ మహా సముద్ర తీర ప్రాంతంలోని 8 దేశాలైన బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, శ్రీలంక, థాయ్‌లాండ్ పేర్లలోని మొదటి ఆంగ్ల అక్షరాల జాబితా ఆధారంగా తుఫాన్లకు పేర్లు పెట్టారు. 2018లో ఈ ప్యానెల్లో ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్ చేరాయి. మొత్తం 64 పేర్లను ఈ ఎనిమిది దేశాలు ఎంపిక చేయగా ఇప్పటికి 57 పేర్లను ఆయా తుఫాన్లకు నామకరణం చేసేశారు. భారత్ సూచించిన పేర్లలో అగ్ని, జలి, బిజిలి, ఆకాష్ ఉండగా.. మలా అనే పేరును శ్రీలంక సూచించింది. ఇక హెలెన్ అనే పేరును బంగ్లాదేశ్ నామకరణం చేయగా, నీలోఫర్‌ పాకిస్తాన్ పెట్టింది.

Tags:    

Similar News