Hyderabad House : నరేంద్ర మోదీ, పుతిన్ భేటీ.. హైదరాబాద్ హౌస్ లోనే ఎందుకు?

ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భేటీ అయ్యారు.

Update: 2025-12-05 07:41 GMT

ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భేటీ అయ్యారు. భారత–రష్యా శిఖరాగ్ర సమావేశం ప్రారంభమయింది. చారిత్రక భవనం మళ్లీ దీనికి వేదికగా మారింది. రాష్ట్రపతి భవన్‌ సమీపంలోని హైదరాబాద్‌ హౌస్‌లో కొద్దిసేపటి క్రితం నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సమావేశం అయ్యారు. భారత్–రష్యా 23వ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా హైదరాబాద్ హౌస్ మళ్లీ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఒకప్పుడు ప్రపంచంలోనే సంపన్నుడిగా పేరొందిన హైదరాబాద్‌ చివరి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌కు చెందిన ఈ రాజప్రసాదం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. విదేశీ అతిథులను ఆతిథ్యం ఇచ్చే ప్రధాన వేదికగా ఇది పనిచేస్తోంది.

విదేశాంగ ఆధ్వర్యంలో...
ప్రస్తుతం ఇది విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ హౌస్ ఉంది. ప్రధానమంత్రి స్థాయి అతిథులకోసం విందులు, ప్రకటనలు, దౌత్య సమావేశాలు ఇక్కడే నిర్వహిస్తుంటారు. హైదరాబాద్‌ హౌస్‌ను 1919లో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్ నిర్మించారు. 1911లో బ్రిటీష్‌ ప్రభుత్వం దేశ రాజధానిని కోల్‌కతా నుంచి ఢిల్లీకి మార్చిన తర్వాత, రాజప్రాంతాల పాలకులు ఢిల్లీలో నివసించడానికి ప్రత్యేక స్థలాలు కేటాయించారు. హైదరాబాదు, బరోడా, పాటియాలా, జయపూర్‌, బీకానీర్‌ రాజవంశాలు ఢిల్లీకి వచ్చినప్పుడు నివసించేందుకు ఇక్కడ స్థలాలను కేటాయించారు. నిజాం 8.2 ఎకరాల భూమిని కొనుగోలు చేసి రాజభవనం నిర్మాణం ప్రారంభించారు. దీనిని రూపకల్పన చేయడానికి ఆ సమయంలో ప్రసిద్ధి చెందిన వాస్తుశిల్పి ఎడ్విన్‌ ల్యూటియన్‌ను నిజాం ఎంచుకున్నారు.
నిజాం నిర్మించిన...
1921–1931 మధ్య ల్యూటియన్‌ రూపొందించిన ఈ భవనం సీతాకోక చిలుక ఆకారంలో నిర్మితమైంది. యూరోపియన్‌ శైలి, మొఘల్‌ మోటిఫ్‌లతో కూడిన నిర్మాణంసాగింది. హైదరాబాద్ హౌస్ లో మొత్తం 36 గదులు ఉన్నాయి. బర్మా నుంచి కలపను దిగుమతి చేశారు. లండన్‌ హోటళ్లలో వాడే స్థాయి ఫర్నిచర్‌ని అమర్చారు. న్యూయార్క్‌ నుంచి విద్యుత్‌ సామగ్రి తెప్పించారు. ఆ కాలంలో ఈ భవనం నిర్మాణ ఖర్చు సుమారు యాభై లక్షల రూపాయలు ఖర్చయిందని చెబుతారు. ఇంత వైభవంగా నిర్మించినా, నిజాం దీనిని పెద్దగా ఇష్టపడలేదని రికార్డులు చెబుతున్నాయి. అందుకే ఈ భవనాన్ని ఆయన కుటుంబం పెద్దగా వినియోగించలేదు.1947లో భారత్‌ స్వాతంత్ర్యం సాధించిన తర్వాత హైదరాబాదు రాష్ట్రం సమాఖ్యలో చేరడానికి నిరాకరించింది. 1948లో ఆపరేషన్‌ పోలో తర్వాత రాష్ట్రం విలీనం అయింది. హైదరాబాద్‌ హౌస్‌ ఖాళీగా ఉండిపోయింది. తర్వాత ఈ ప్రభుత్వం విదేశాంగ అధీనంలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ హైదరాబాద్ హౌస్ లోనే మోదీ, పుతిన్ భేటీ కొనసాగుతుంది.


Tags:    

Similar News