నిర్లక్ష్యంగా కార్ డోర్ తెరిచి.. రెండు ప్రాణాలు బలి

రోడ్డు మీద వాహనాలను ఆపేసి ముందు వెనుకా చూడకుండా డోర్లను తెరుస్తూ ఉంటారు.

Update: 2025-06-20 11:15 GMT

cardoor

రోడ్డు మీద వాహనాలను ఆపేసి ముందు వెనుకా చూడకుండా డోర్లను తెరుస్తూ ఉంటారు. అలా చేయడం వలన ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అలా ఓ కారు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఏడు నెలల గర్భిణి ప్రాణాలు పోయిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. బాలనగర్‌కు చెందిన సయ్యద్‌ జమీర్, ఆస్ర ఫాతిమా దంపతులకి నాలుగేళ్ల కుమార్తె ఉంది. ఫాతిమా ఏడు నెలల గర్భిణి. ఓ ఆసుపత్రిలో భర్త ఆమెకు వైద్య పరీక్షలు చేయించారు.


అనంతరం ద్విచక్ర వాహనంపై భార్యాభర్తలు కుమార్తెతో కలిసి ఇంటికి తిరిగి వస్తున్నారు. 198వ పిల్లర్‌ దగ్గర ఓ కారు ఆగింది. వెనక వస్తున్న ద్విచక్రవాహనాన్ని గమనించకుండా కారు డ్రైవర్‌ డోరు తీశాడు. అది ఈ కుటుంబం వస్తున్న బైక్ కు తగలడంతో అదుపు తప్పి వెనక కూర్చున్న ఫాతిమా, కుమార్తె కుడివైపు పడిపోయారు. అదే సమయంలో వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనక చక్రాల కింద ఫాతిమా పడిపోవటంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అలాంటి సమయం లోనూ ఆమె తన కుమార్తెను దూరంగా నెట్టి ఆమె ప్రాణాలు కాపాడారు. నిర్లక్ష్యంగా కారు డోరు తీసిన వ్యక్తి పారిపోయాడు.

Tags:    

Similar News