Hyderabad : కిలాడీ లేడీ అరెస్ట్
హైదరాబాద్ నగరంలోని అనేక ఆసుపత్రుల్లో డాక్టర్ గా నటిస్తూ రోగులను దోచుకుంటున్న దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు
హైదరాబాద్ నగరంలోని అనేక ఆసుపత్రుల్లో డాక్టర్ గా నటిస్తూ రోగులను దోచుకుంటున్న దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని వివిధ ఆసుపత్రులలో వైద్యురాలిగా నటిస్తూ, రోగులకు మత్తుమందు ఇచ్చి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను అపహరిస్తున్న ఒక మహిళను మరియు ఆమెకు సహకరిస్తున్న ఆమె భర్తను సికిందరాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ మరియు మార్కెట్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లాకు చెందిన శిరీష్, ఆమె భర్త సాయికుమార్ గౌడ్ లు చిరు వ్యాపారం నిర్వహిస్తున్నారు. అయితే అక్రమ మార్గంలో డబ్బును సంపాదించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. నిందితురాలు శిరీష ప్రస్తుతం డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చదువుతోంది.
ఆర్థిక ఇబ్బందులతో...
ఆర్థిక ఇబ్బందుల వల్ల సులభంగా డబ్బు సంపాదించేందుకు తన భర్తతో కలిసి ఆసుపత్రులలో దొంగతనాలకు ప్లాన్ చేసింది. తన వైద్య పరిజ్ఞానంతో వృద్ధ మహిళా రోగులను లక్ష్యంగా చేసుకునేది. డాక్టర్ ఆప్రాన్ ధరించి ఆసుపత్రిలోకి ప్రవేశించి, తన వెంట తెచ్చుకున్న 'డయాజెపామ్ మత్తు ఇంజక్షన్‌ను బాధితులకు ఇచ్చేది. వారు స్పృహ కోల్పోయిన తర్వాత వారి బంగారు ఆభరణాలను దొంగిలించి పరారయ్యేది.గత మార్చి 11న సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో, అలాగే చందానగర్‌లోని సిటిజన్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వీరు ఇదే తరహాలో చోరీలకు పాల్పడ్డారు. దొంగిలించిన సొమ్మును విలాసాలకు, షాపింగ్‌కు ఖర్చు చేసేవారు. వీరి నుంచి పోలీసులు పదకొండు తులాల బంగారు ఆభరణాలు, ఒక కారును, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.