Hyderabad : మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ లో కొత్త కోణం
మోయినాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ కలకలం రేపుతుంది.
మోయినాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ కలకలం రేపుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలు ఇందులో ఉండటం ఈ సంచలనానికి కారణమయింది. డ్రగ్స్ వినియోగం కానీ, అమ్మకం కాని నేరమని తెలిసినప్పటికీ ప్రజాప్రతినిధులు డ్రగ్స్ కు అలవాటుపడటంతో వారి వ్యక్తిగత ఇమేజ్ దెబ్బతినడంతో పాటు పార్టీ ప్రతిష్టను కూడా మంట గలిపే రకంగా ఉంది. రాజకీయంగా వారికి ఇది ఇబ్బందికరమైన పరిణామమే. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి లు డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని చెబుతున్నప్పటికీ ప్రజాప్రతినిధులు కూడా ఇందులో భాగస్వామ్యులు కావడంతో ప్రజల్లో మరింత పలుచనగా మారనుంది. ఎంపీ అయినా, మాజీ ఎమ్మెల్యే అయినా వదిలేది లేదని ఎస్సీ గిరిధర్ తెలిపారు.
పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేసులో...
పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ మెయినాబాద్ లో ఉంది. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలోనూ ఈ ఫామ్ హౌస్ వేదికగా మారింది. అయితే నేడు అదే ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారం రావడంతో పోలీసులు రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో ఈగల్ టీమ్‌తో కలిసి ఫామ్ హౌస్‌పై దాడి చేశారు. అక్కడ తొమ్మిది మంది పురుషులు, ఒక మహిళ కలిపి మొత్తం 10 మంది ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇందులో ఏలూరు టిడిపి ఎంపీ పుట్ట మహేష్ కూడా అక్కడ ఉన్నారు. పోలీసులు అక్కడికి చేరుకున్న వెంటనే ఢిల్లీకి చెందిన రియల్టర్ నమిత్ శర్మ గాల్లోకి ఒక రౌండ్ ఫైర్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఆ తుపాకీ రితేష్ రెడ్డి పేరుతో లైసెన్స్ ఉన్న గన్ అని గుర్తించారు. పోలీసులు ఒక లైవ్ రౌండ్, ఒక ఖాళీ కార్ట్రిడ్జ్‌తో పాటు ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.
సిమ్లా నుంచి తీసుకు వచ్చి...
అక్కడి నుంచి వైట్ పౌడర్, అంటే కొకైన్ అనుమానిస్తున్న పదార్థాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్టంట్ డ్రగ్ టెస్ట్ కిట్‌తో పరీక్షించగా రోహిత్ రెడ్డి, నమిత్ శర్మ, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, పుట్టా మహేష్, అర్జున్ రెడ్డి కలిపి ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఇప్పుడు వీరిని హాస్పిటల్‌కు తరలించి మరిన్ని పరీక్షలు చేస్తున్నారు. ఈ డ్రగ్స్ పార్టీ, కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సిమ్లా నుంచి బెంగళూరుకు చెందిన కౌశిక్ రవి అనే వ్యక్తి ఈ డ్రగ్స్ ను హైదరాబాద్ కు తెచ్చినట్లు అంగీకరించారు. కౌశిక్ రవి పైలట్ రోహిత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని పోలీసులు తెలిపారు. కొకైన్ తో పాటు మెత్ వాడినట్లు పోలీసులు కనుగొన్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఈ పార్టీ ప్రారంభమయిందని పోలీసులు చెబుతున్నారు. తిరువీడుల అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ, పంజుగుల రోహిత్ రెడ్డి, పుట్టా మహేష్ కుమార్ యాదవ్ లకు పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.