Cyber Crime : ఒంటరిగా ఉన్న వాళ్లే టార్గెట్.. సైబర్ నేరగాళ్లు కొత్త దారులు
సైబర్ నేరగాళ్లు కొత్త దారులు వెతుక్కుంటున్నారు
సైబర్ నేరగాళ్లు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. అమ్మాయిలు, ఆంటీల పేరిట వల వేస్తూ అందిన కాడికి దోచుకునే ప్రయత్నానికి దిగారు. ఇప్పటి వరకూ డిజిటల్ అరెస్ట్ అంటూ మోసం చేసిన సైబర్ నేరగాళ్లు ఈ కొత్త పోకడలతో ముందుకు వచ్చి ఒంటరిగా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని డబ్బులు దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఇటువంటి వీడియోలు, యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఒంటరిగా ఉన్న వారిని...
"ఒంటరిగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం.. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. అందమైన అమ్మాయిలు, ఆంటీలతో సరదాగా మాట్లాడండి. మీ రంగు, రూపంతో మాకు పనిలేదు." అంటూ సోషల్ మీడియాలో ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తున్న ఈ యాడ్స్ వెనుక ఉన్నది తీయటి మాటలు కాదు.. నిలువునా దోచేసే సైబర్ కేటుగాళ్ల ఉచ్చు బిగించేస్తున్నారని పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. యువత ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని నేరగాళ్లు పన్నుతున్న హనీట్రాప్ ఇది అని ఆయన తెలిపారు. ఈ వీడియోల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న అమ్మాయిలు నిజం కాదని, అవన్నీ ఏఐ సాయంతో సృష్టించిన వీడియోలని చెప్పారు.
మాయమాటలు చెప్పి...
మాయమాటలకు బుట్టలో పడి వారు సూచించిన యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుంటే ముప్పు కొనితెచ్చుకున్నట్లేనని, ఆ లింక్ ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకోగానే, మీ ఫోన్‌లోని కాంటాక్ట్స్, గ్యాలరీ మొత్తం వారి అధీనంలోకి వెళ్లిపోతాయని సజ్జనార్ తెలిపారు.ఇక రాత్రిపూట సరదాగా మాట్లాడుదమని వీడియో కాల్ చేస్తే.. అవతలి వైపు న్యూడ్ వీడియోలు ప్లే చేసి, స్క్రీన్‌పై ఉన్న మీ ముఖాన్ని రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని మార్ఫింగ్ చేసి, మీ కాంటాక్ట్ లిస్ట్‌లోని బంధుమిత్రులకు పంపుతామంటూ బ్లాక్‌మెయిలింగ్ సెక్స్‌టార్షన్ కు దిగుతారని తెలిపారు. పరువు పోతుందన్న భయంతో వారు అడిగినంత ఇచ్చుకుంటూ పోతే మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ అవ్వడం ఖాయమని హెచ్చరించారు.
ఆన్ లైన్ స్నేహితులమంటూ...
యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి మోసపూరిత ప్రకటనలు ఇస్తున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. ఆన్‌లైన్‌లో ఎవరూ మీకు ఊరికే స్నేహితులు కారు.. ఆ ఆకర్షణ వెనుక మీ డబ్బు, పరువు లాగేసే భారీ కుట్ర దాగి ఉందని గ్రహించాలని, క్షణికావేశంలో గుర్తుతెలియని ఫేక్ డేటింగ్, వీడియో కాలింగ్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు. రాత్రి వేళల్లోనే ఈ యాడ్స్ దర్శనమిస్తున్నాయి.. జాగ్రత్తగా ఉండాలని, ఒకవేళ ఇప్పటికే ఎవరైనా ఇలాంటి సైబర్ వలలో చిక్కుకుంటే, పరువు పోతుందేమో అని భయపడకండి. వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని పోలీస్ కమిషనర్ సజ్జనార్ కోరారు.