Hyderabad : హైదరాబాద్ ను ఆపడం ఎవరి తరం? ఒక్కసారి ఇక్కడ సెటిలయితే చాలు

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగానికి ఎప్పటికీ కొదవలేదు. ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్టులు ఊరిస్తుంటాయి

Update: 2025-06-27 04:48 GMT

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగానికి ఎప్పటికీ కొదవలేదు. ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్టులు ఊరిస్తుంటాయి. హైదరాబాద్ నగరం పెరగటమే కాని, నగరంలో రియల్ ఎస్టేట్ తగ్గిన కాలం అస్సలు లేదనే చెప్పాలి. 1990వ దశకం నుంచి ప్రారంభమయిన ఈ ఉధృతి అలాగే కొనసాగుతుంది. పాలకులు, వారి పాలసీలతో సంబంధం లేకుండా పెరిగే ఏకైక నగరం హైదరాబాద్ మాత్రమే. బెంగళూరుకు మించి హైదరాబాద్ నగరం విస్తరించింది. అందుకే మౌలిక సదుపాయాల కల్పనలో ఏ ప్రభుత్వమయినా కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తుంది. ఇక మంచి వెదర్ తో పాటు కాస్మోపాలిటన్ సిటీగా మారడం, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే నగరం హైదరాబాద్ మాత్రమే.

విస్తరణకు అనువుగా...
అందుకే ఏ ప్రభుత్వం వచ్చినా హైదరాబాద్ నగరం విస్తరణకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పాలసీలను రూపొందించుకోవాల్సి ఉంటుంది. అందరికీ తాగు నీటిని అందించేలా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మెట్రో రైలు, ఫ్లై ఓవర్లతో ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫోర్త్ సిటీని కూడా అభివృద్ధి చేయడం ప్రారంభించింది. తాజాగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో నియో పొలిస్ మరో భారీ ప్రాజెక్టును నిర్మిస్తుంది. దీని విలువ 3,169 కోట్ల రూపాయలుగా అంచానా. దీనికి కాస్ కేడ్స్ నియోపోలిస్ పేరుతో నిర్మిస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. మొత్తం ఐదు బ్లాక్ లలో ఆరు అంతస్తులను నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం 1,189 ఫ్లాట్లు అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. చదరపు గజం పది వేల రూపాయలుగా చెబుతోంది.
ట్రంప్ టవర్ ఏర్పాటయితే...
ఇక అదనంగా పార్కింగ్, ఇతర సదుపాయాల కోసం అదనపు మొత్తాన్ని వసూలు చేస్తారు. దీంతో పాటు ట్రంప్ సంస్థ నిర్మించే మరో భవనాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ లో ట్రంప్ టవర్ అందుబాటులోకి వస్తే నగరం రూపురేఖలే మారనున్నాయి. అత్యంత ఎత్తైన ఈ టవర్ల నిర్మాణపనులు ప్రారంభ కానున్నాయి కోకాపేట్ లో నిర్మాణమయ్యే ట్రంప్ టవర్ కూడా ఏర్పాటయితే ఇక హైదరాబాద్ అభివృద్ధిని ఎవరూ అపలేరన్నది వాస్తవం. . కోకాపేట్ లోని నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ట్రంప్ టవర్స్ ను నిర్మించనున్నారు. వీటిని ట్రిబెకా డెవలెపర్స్ నిర్మిస్తున్నట్లు ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగంలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ట్రంప్ టవర్స్ అంచనా వ్యయం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అని చెబుతున్నారు. మొత్తం నాలుగు వందల వరకూ లగ్జరీ ఫ్లాట్లను నిర్మించనున్నారు. ఒక్కొక్క ఫ్లాట్ ధర ఐదు కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని ప్రాధమిక అంచనా.
నగరానికి నాలుగువైపులా...
ఇక మధ్యతరగతి ప్రజల కోసం కూడా అనేక అపార్ట్ మెంట్లు నగరానికి నాలుగువైపులా నిర్మాణమవుతున్నాయి. ఇటు మేడ్చల్, హయత్ నగర్, సాగర్ రోడ్డులో చాలా వరకూ నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణం చేయతలపెట్టిన ఫోర్త్ సిటీలో కూడా భూముల ధరలు పెరిగాయి. ఎంతగా అంటే ఇప్పడు అక్కడ సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయలేనంతగా పెరిగిపోయాయి. అక్కడకు మెట్రో రైలు ప్రతిపాదనను కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. అది పూర్తయిందంటే అక్కడ కూడా అభివృద్ధిని ఆపడం ఎవరి తరమూ కాదు. ఇటు ధనిక, అటు మధ్యతరగతి ప్రజలకు అనుగుణంగా నివాస భవనాలు రెడీ టూ ఆక్యూపైకి సిద్ధంగా ఉండటంతో హైదరాబాద్ మరో ఏడాదిలో మరో పది లక్షల జనాభా పెరుగుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.


Tags:    

Similar News