సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఈ రోజు జరిగే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. సంక్రాంతికివెళ్లేవారికి టోల్ ఫీజుల నుంచి మినహాయింపులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా సంక్రాంతికి హైదరాబాద్-విజయవాడ హైవేపై టోల్ ఫ్రీ ప్రయాణంతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని టోల్ గేట్ల నుంచి ఈ వెసులు బాటు కల్పించాలని తెలంగాణ సర్కార్ యోచిస్తుంది. సంక్రాంతి రద్దీ దృష్ట్యా టోల్ రుసుము మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకనే అవకాశముంది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాయాలని ఇప్పటికే నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, కరీనంగర్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ వెళ్లే వారిందరికీ ఈ వెసులుబాటు కల్పించనున్నారు. అయితే ఎన్ని రోజులు ఈ టోల్ ఫ్రీ ని అమలు చేయాలన్న దానిపై నేడు నిర్ణయం తీసుకోనున్నారు.
హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్...
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రా వైపు వెళ్లే ప్రయాణికులకు ఊరటనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. పండుగ సమయంలో అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై మూడు, నాలుగు రోజుల పాటు టోల్ వసూళ్లను నిలిపివేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి యోచిస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ కు లేఖ రాయాలని నిర్ణయించారు.ప్రతి ఏటా సంక్రాంతికి పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరుతుంటాయి. అలాగే తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఉన్న టోల్ గేట్లకు వాహనాల ద్వారా చెల్లింపు అయ్యే మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించేందుకు సిద్ధమయింది. దీనిపై ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
లక్షల సంఖ్యలో వాహనాలు...
ఫాస్టాగ్ ఉన్నప్పటికీ లక్షల సంఖ్యలో వాహనాలు రావడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈ హైవేపై ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, విస్తరణ పనులు జరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశముంది. టోల్ వసూళ్ల కోసం వాహనాలను ఆపితే హైవే మొత్తం స్తంభించిపోయే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ నేపథ్యంలో వాహనాలు టోల్ గేట్ల వద్ద ఆగకుండా సాఫీగా వెళ్లేలా చూసేందుకే టోల్ మినహాయింపు ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఈ అంశంపై చర్చించేందుకు మంగళవారం సచివాలయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా కలెక్టర్లు, పోలీస్, ఆర్అండ్‌బీ అధికారులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్రం గనుక ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందిస్తే, ఈసారి సంక్రాంతి ప్రయాణం ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా మారనుంది.