హైదరాబాద్ నగరంలోకి ఏనుగు దంతాలను తీసుకుని వచ్చి అమ్మాలని చూసారు. అయితే ముఠాలోని ఒక సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని రాయచోటికి చెందిన రేకులకుంట ప్రసాద్ గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టై తిరుపతి జైలులో ఉండగా, అక్కడ లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తితో పరిచయం పెంచుకున్నాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత వీరిద్దరూ ఏనుగు దంతాలను అక్రమంగా రవాణా చేసి ఇతర ప్రాంతాల్లో విక్రయించాలని ప్లాన్ చేసుకున్నారు. లోకేశ్వర్ రెడ్డి శేషాచలం అడవుల్లోని స్మగ్లర్ల నుంచి రెండు దంతాలను కొనుగోలు చేశాడు. అనంతరం వీటిని ప్రైవేట్ ట్రావెల్బస్సులో హైదరాబాద్ తీసుకొచ్చారు. పోలీసులకు అనుమానం రాగా ప్రసాద్ దొరికిపోయాడు. లోకేశ్వర్ రెడ్డి పరారయ్యాడు. ఏనుగు దంతాల బరువు 5.62 కిలోలు ఉందని, వీటిని ఏనుగు నుంచి కట్చేసినట్లు అటవీ శాఖ అధికారులు ధ్రువీకరించారు.