Hyderbad : నందినగర్ వద్ద భారీ బందోబస్తు
నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వచ్చి విచారణకు హాజరుకావాలని సిట్ నోటీసులు ఇచ్చింది
బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావును సిట్ విచారణకు పిలవడంతో తెలంగాణ పోలీసు శాఖ హై అలర్ట్ ప్రకటించింది. నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వచ్చి విచారణకు హాజరుకావాలని సిట్ నోటీసులు ఇచ్చింది.ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం నందినగర్ వద్ద బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ భవన్ వద్ద కూడా పెద్దయెత్తున పోలీసులను మొహరించారు.
ఇంటలిజెన్స్ నివేదికల హెచ్చరికలతో...
రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లోనూ ర్యాలీలు, ధర్నాలు, దిష్టిబొమ్మల దహనం వంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇవి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి.రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని ఫీల్డ్ అధికారులను పరిస్థితిని నిశితంగా గమనించాలని, అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు.