Hyderabad : ఇరుకు సందుల్లో వ్యాపారాలు.. అక్కడే జీవనం.. అదే మృత్యువు రాకకు కారణం
హైదరాబాద్ లో వరస అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఫైర్ సేప్టీ నిబంధనలను ఏ మాత్రం పాటించరు
హైదరాబాద్ లో వరస అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఫైర్ సేప్టీ నిబంధనలను ఏ మాత్రం పాటించరు. రాజధాని కావడం ఎక్కువ మంది రోజూ నగరానికి వస్తుండటంతో వ్యాపారాలు ఇక్కడ రోజుకు కోట్లాది రూపాయలు జరుగుతుంటాయి. రోజుకు వేల కోట్ల రూపాయల మేరకు అన్ని రకాల వ్యాపారాలు జరుగుతుంటాయి. కేవలం తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా నిత్యం లక్షలాది మంది వస్తుంటారు. దీంతో వ్యాపారానికి హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారడంతో ప్రతి అడుగు స్థలం విలువైనదిగా భావించి వ్యాపారులు ఫైర్ సేఫ్టే నిబంధనలు తుంగలో తొక్కి మరీ భవనాలలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. పురాతన భవనాలు కూల్చివేయాలని మున్సిపల్ అధికారులు అనేక సార్లు ప్రయత్నించినా దానికి రాజకీయ నేతలే అడ్డంకిగా మారారు.
వాహనాలు వెళ్లేందుకు..
ముఖ్యంగా సికింద్రాబాద్, పాతబస్తీ ప్రాంతాల్లో ఇరుకైన రహదారుల్లో వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. నిత్యం రద్దీగా ఉండే ప్రదేశాలు. వాహనాలు వెళ్లేందుకు కూడా దారి ఉండదు. నడవడానికే కష్టపడాల్సిన పరిస్థితి చార్మినార్ ప్రాంతంలో ఉంటుంది. అక్కడే అన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చార్మినార్ ను చూడటం కోసం నిత్యం వేలాది మంది పర్యాటకులు అక్కడికి వస్తుంటారు. ఇక అక్కడ గాజుల విక్రయాలకు ప్రసిద్ధి. అక్కడే వెరైటీ గాజులు తయారీ చేసి వ్యాపారులు విక్రయిస్తుంటారు. దీనిని చుడీ బజార్ అంటారు మరొక వైపు ఇక ముత్యాల వ్యాపారానికి కూడా చార్మినార్ ప్రాంతం ప్రసిద్ధి. పెరల్స్ వ్యాపారం చేసే వాళ్లు వందల సంఖ్యలో ఉంటారు.
ముత్యాలు నాణ్యమైనవిగా...
నాణ్యమైన ముత్యాలు, చౌకగా లభిస్తాయని తెలిసి ఇక్కడికే వచ్చి అనేక మంది కొనుగోలు చేస్తుంటారు. ఇక వీధులను చూస్తే సందుల్లోనూ పదుల సంఖ్యలో కుటుంబ సభ్యులు ఒకే గదిలో ఉంటూ వ్యాపారాలు చేసుకుంటారు. తమ భవనాలకు కనీసం ఫైర్ సేప్టీ నిబంధనలు ఉన్నాయా? లేదా? అన్నది మాత్రం పట్టించుకోరు. పాతబస్తీలో వేలు పెట్టడానికి ఏ పాలకుడూ ప్రయత్నించరు. ఒకవేళ ప్రయత్నిస్తే రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తారు. పాతబస్తీ ప్రమాదంలో పదిహేడుమంది మరణించారంటే దానికి ప్రధాన కారణం ఫైర్ సేఫ్టీ నిబంధనలను అమలు పర్చకపోవడమే. కనీసం అగ్నిమాపక శకటం కూడా భవనం వద్దకు వెళ్లే పరిస్థితి లేదంటే ఎంత దారుణమైన వీధులో వేరే చెప్పాల్సిన పనిలేదు.
నోటీసులిచ్చినా...
జీహెచ్ఎంసీ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది నోటీసులు ఇచ్చినా ఫలితం ఉండదు. వారు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే వారికి రాజకీయ నేతల అండదండలుంటాయి. అందుకే కనీసం రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలన్నా అటువంటి ప్రాంతాల్లో పాలకులకు కష్టసాధ్యంగా మిగిలిపోయింది. ఎన్ని ఘటనలు జరిగినా వరసగా జరుగుతూనే ఉన్నప్పటికీ ప్రజల్లో మార్పు రావడం లేదు. ప్రమాదం చెప్పి రాదు. పాత కాలంనాటి భవనాల్లో విద్యుత్తు వైర్లను మార్చేందుకు కూడా ఎవరూ ఇష్టపడరని అధికారి ఒకరు చెప్పడం విశేషం. అందుకే ప్రభుత్వ చర్యలకు అడ్డుపడకుండా ఉంటే ఇంత పెద్ద స్థాయిలో ప్రమాద జరిగి భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగి ఉండేది కాదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.