తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ రద్దీ
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ రద్దీ కొనసాగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ రద్దీ కొనసాగుతుంది. సొంతూళ్లకు హైదరాబాద్ వాసులు పయనమయ్యారు. ఈరోజు కూడా రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లలో ప్రయాణికులు కిక్కిరిసి పోయారు. ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకూ సంక్రాంతి పండగ కావడంతో ఈరోజు కూడా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. బస్టాండ్‌కు వచ్చిన క్షణాల్లోనే బస్సులు నిండిపోతున్నాయి. గంటల తరబడి బస్టాండ్‌లో ప్రయాణికుల పడిగాపులు కాస్తున్నారు. జేబీఎస్, ఉప్పల్ క్రాస్‌రోడ్, కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి, ఎల్బీనగర్ నుంచి ప్రత్యేకబస్సు సర్వీసులు నడుపుతున్నారు.
ప్రత్యేక బస్సులు నడుపుతున్నా...
ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్‌లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. ఏపీ, తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. తెలంగాణ ఆర్టీసీ 6,431 ప్రత్యేక బస్సులు నడుపుతుంది. హైదరాబాద్-విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ నేడు కూడా ఎక్కువయింది. పంతంగి టోల్‌ప్లాజా దగ్గర వాహనాలు బారులు తీరాయి. ఏపీ-తెలంగాణ సరిహద్దులో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. చిల్లకల్లు దగ్గర వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. విజయవాడ బస్టాండ్,రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది. 600 ప్రత్యేక బస్సులు ఏపీఎస్ ఆర్టీసీ నడుపుతుంది. పండుగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు కూడా దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది.