Revanth Reddy : సినీ కార్మికులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
చిత్రపరిశ్రమ కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరాలు ప్రకటించారు
చిత్రపరిశ్రమ కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరాలు ప్రకటించారు. ఫోర్త్ సిటీలో చిత్రపరిశ్రమ కార్మికులకు అవసరమైన ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పారు. ఇక పెద్ద సినిమాలు నిర్మించిన వారు తమకు వచ్చిన లాభాల్లో ఇరవై శాతం కార్మికులకు ఇచ్చే విధంగా నిర్మాతల మండలితో చర్చించి వారిని ఒప్పించేందుకు తాను ప్రయత్నిస్తానని చెప్పారు. ఎక్కువ మంది కార్మికులు రాత్రినక, పగలనక, ఎండనక, వాననక పనిచేస్తేనే చిత్రం రూపుదిద్దుకుంటుందని, లాభాల్లో వారికి వాటా ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అలాగే కృష్ణానగర్ లో ప్రభుత్వ స్థలం ఉంటే చూసి అక్కడ సినీ కార్మికుల పిల్లలు చదువుకునేందుకు కార్పొరేట్ స్థాయిలో పాఠశాలను నిర్మించి ఉచితంగా విద్యను అందచేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఆరోగ్యపరమైన ఇబ్బందులు...
వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తే రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద వారికి అన్ని రకాల వైద్య సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. తాను చేసిన సాయాన్ని మర్చిపోయేవాడిని కాదని, సినీ కార్మికులు సంక్షేమంతోనే చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అలాగే హాలీవుడ్ స్థాయికి టాలీవుడ్ ఎదగాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సినీ కార్మికుల సంఘం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సన్మానించింది. యూసఫ్ గూడలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గదర్ అవార్డులను ఇప్పటికే ప్రవేశపెట్టామని, త్వరలోనే మరొకసారి సమావేశమై కార్మికుల సమస్యలపై చర్చిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.