Hyderabad :ఈ మాత్రం గాలికే గంటలు గంటలు కరెంట్ తీస్తే ఎలా? సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్న నెటిజన్లు

హైదరాబాద్ నగరంలో విద్యుత్తు అంతరాయం అందరినీ ఇబ్బందులపాలు చేసింది.

Update: 2024-05-08 04:10 GMT

గతంలో ఎంత పెద్ద ఈదురుగాలులు వీచినా గంటకు మించి పెద్దగా విద్యుత్తు సౌకర్యానికి అంతరాయం ఏర్పడేది కాదు. కానీ నిన్న రాత్రి మాత్రం సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకూ అనేక ప్రాంతాల్లో విద్యుత్తు అనేది లేకుండా పోయింది. ఈదురుగాలులు బలంగా వీచాయని అనుకుంటే గతంలోనూ ఇంతకంటే ఎక్కువ స్థాయిలో గాలులు వీచాయి. అయితే నిన్న అరగంట సేపు మాత్రమే ఈదురు గాలులు వీచాయి. తర్వాత కుండపోత వర్షం కురిసింది. విద్యుత్ ఎప్పుడు వస్తుందన్న సమాచారాన్ని కూడా ప్రజలకు ఇవ్వడంలో అధికారులు విఫలమయ్యారు. కనీసం విద్యుతు కార్యాలయాల ఫోన్లు కూడా ఎత్తకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారు.

గంటల పాటు విద్యుత్ కు...
అయినా హైదరాబాద్ నగరంలో కరెంట్ కట్ అందరినీ ఇబ్బందులపాలు చేసింది. రౌతు మెత్తనైతే గుర్రం రెండు కాళ్లు మీద నడుస్తుందన్న సామెతగా ఈసారి మాత్రం విద్యుత్తు సంస్థ అధికారులు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేకపోయారు. దాదాపు ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు విద్యుత్తు లేకుండానే గడపాల్సి వచ్చింది. పోనీ కుండపోత వర్షమూ పెద్దగా కురియలేదు. గాలులు ఆగిపోయినా.. గంటల తరబడి విద్యుత్తును పునరుద్ధరించకపోవడంపై ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తుంది. గతంలో ఇన్వెర్టర్ల వాడకం పెద్దగా ఉండేది కాదు. ఏ మాట కామాట.. కేసీఆర్ హయాంలో విద్యుత్తు అసౌకర్యం అనేది సామాన్యంగా జరగలేదని నెటిజన్లు అంటున్నారు.
సోషల్ మీడియాలో...
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్తు అధికారులు, సిబ్బంది మాత్రం తమ పని కాదన్నట్లు వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నట్లే కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై హైదరాబాద్ నగరంలోని అనేక మంది నెటిజన్లు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రభుత్వ పనితీరు నిన్నటి విద్యుత్తు అంతరాయంతో అర్థమయిందని సెటైర్లు కూడా కొందరు వేస్తున్నారు. కానీ విద్యుత్తు సిబ్బంది మాత్రం గాలికి ఎక్కువ చోట్ల విద్యుత్తు స్థంభాలు పడిపోవడంతో పాటు ట్రాన్స్‌ఫారాలు పేలిపోవడం వల్లనే విద్యుత్తుకు అంతరాయం ఏర్పడిందని వివరణ ఇస్తున్నాయి. మొత్తం మీద ఎన్నికల సమయంలో ఈ విద్యుత్తు అంతరాయం కొంత అధికార పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఇక వర్షాలు కురిసే సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.


Tags:    

Similar News