Hyderabad Fire Accident : హైదరాబాద్ అగ్నిప్రమాదం వెనక విస్తుబోయే నిజాలివే
హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగిందని అధికారులు నిర్ధారణకు వచ్చారు
హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగిందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఏసీ కంప్రెషర్ పేలడంతోనే ప్రమాద తీవ్రత పెరిగిందని ఒక అంచనాకు వచ్చిన కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోనూ అదే పేర్కొంది. హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదం లో పదిహేడు మంది మరణించిన ఘటనలో ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఇంట్లో ఉన్నవారి నిర్లక్ష్యమే ప్రమాదంలో ఇంత మంది పెరగడానికి కారణమన్న అభిప్రాయానికి వచ్చింది. తెల్లవారు జామున 5.15 గంటలకు చిన్న స్పార్క్ లాంటి మంటలు వచ్చాయని, వాటిని తామే ఆర్పేందుకు ఇంట్లో ఉన్న వారు ప్రయత్నించారన్నారు.
గంట సేపు ప్రయత్నించి...
దాదాపు గంట సేపు మంటను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసిన ఇంట్లో వారు అది విఫలం కావడంతో అప్పుడు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరు మహిళలు భవనం కిందకు వచ్చి కేకలు వేశారని, దీంతో స్థానికులు కూడా కొందరు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారే కానీ అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయాలన్న ఆలోచన వారికి రాలేదని తెలిపారు. కింది అంతస్తులో మొదలయిన మంటలు పైన అంతస్తు వరకూ వ్యాపించేంత వరకూ స్థానికులు, కుటుంబ సభ్యులు కలసి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారన్నారు. దానివల్లనే పదిహేడు మంది మరణించడానికి ప్రధాన కారణమయిందని చెప్పారు.
వెంటనే ఫోన్ చేసి ఉంటే...
వెంటనే అగ్ని మాపక శాఖకు ఫోన్ చేసి ఉంటే వారు వచ్చి భవనంలో ఉన్న వారిని బయటకు తీసుకు వచ్చేవారని కమిటీ అభిప్రాయపడింది. భవనంలో ఉన్న వారంతా పొగలు వ్యాపించేంత వరకూ తలుపులు మూసుకుని అక్కడే ఉండటంతో ఊపిరాడకపోవడం వల్లనే మరణించారని నిర్ధారణకు వచ్చారు. ఇంటియజమానుల నిర్లక్ష్యమే ప్రమాద తీవ్రత పెరగడానికి కారణమయిందని కమిటీ అభిప్రాయపడింది. ప్రమాదం నుంచి తప్పించుకోవడానిక పై అంతస్తుకు వెళ్లి తలుపులు వేసుకోకుండా మరో మార్గంలో బయటకు వచ్చేందుకు ఏమైనా ప్రయత్నం చేసి ఉంటే గాయాలతోనైనా బయటపడే వారని నిపుణులు అభిప్రాయపడ్డారు. అందుకే మంటలను తేలిగ్గా తీసుకున్న ఇంటియజమానులు వాటిని అదుపు చేయలేక ఇంత మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యారన్నది కమిటీ అభిప్రాయంగా తెలుస్తుంది.