నిజాంపేట్లో నస్రీన్‌ చిట్‌ఫండ్స్‌ మోసం.. ₹12 కోట్లు దోపిడీ ఆరోపణ

15 ఏళ్లుగా నకిలీ చిట్స్‌.. అకస్మాత్తుగా తలుపులు వేసి పరారీ 50 మందికిపైగా బాధితులు.. సైబరాబాద్‌ ఈఓడబ్ల్యూ దర్యాప్తు

Update: 2025-10-29 14:49 GMT

హైదరాబాద్‌: నిజాంపేటకు చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి పి.ప్రవీణ్‌కుమార్‌ (40) సైబరాబాద్‌ ఎకనామిక్‌ ఆఫెన్సెస్‌ వింగ్‌ (ఈఓడబ్ల్యూ)కు ఫిర్యాదు చేస్తూ, నస్రీన్‌ చిట్‌ఫండ్స్‌ పేరుతో ముహమ్మద్‌ అలీ, ముహమ్మద్‌ రేష్మా జబీన్‌ తాము సహా పలువురి నుండి ₹12 కోట్లకు పైగా మోసం చేశారని ఆరోపించారు.

ఫిర్యాదు వివరాల ప్రకారం, ముద్దాయిలు నిజాంపేట, మెడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలకు చెందినవారు. సుమారు 15 ఏళ్లుగా ఇంటి నుంచే రిజిస్ట్రేషన్‌ లేకుండా చిట్‌ స్కీమ్స్‌ నడిపి స్థానికుల విశ్వాసం పొందారు. 2016లో ‘నస్రీన్‌ చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’గా సంస్థను నమోదు చేసి, ముహమ్మద్‌ అలీ, దీప్తి సుంకర డైరెక్టర్లుగా ఉన్నారని తెలిపారు.

₹34 లక్షలు చెల్లించినా రీఫండ్‌ లేదని పిర్యాదు

ప్రవీణ్‌కుమార్‌ ₹50 లక్షలు, ₹30 లక్షలు, ₹20 లక్షల విలువైన చిట్స్‌లో సభ్యత్వం తీసుకుని, మొత్తం ₹34 లక్షలు గూగుల్‌పే, ఫోన్‌పే, బ్యాంక్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా నస్రీన్‌ ఎంటర్‌ప్రైజెస్‌, సిద్దిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌, అహ్మద్‌ అలీ (ఖాజా ఫ్రూట్స్‌ అండ్‌ వెజిటబుల్స్‌) పేర్లకు పంపినట్టు తెలిపారు. అక్టోబర్‌ 2025లో సంస్థ భారీ నష్టాల కారణంగా కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించడంతో సభ్యులు రీఫండ్‌ కోరగా, ఇల్లు అమ్మి చెల్లిస్తామని చెప్పి పది రోజుల్లో ఇంటికి తాళం వేసి అదృశ్యమయ్యారని తెలిపారు.

50 మందికి పైగా బాధితులు, ₹12 కోట్లు నష్టం

ఇప్పటివరకు 50 మందికి పైగా బాధితులను గుర్తించగా, మొత్తం నష్టం ₹12,06,73,273గా అంచనా వేశారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేసే కరీం అనే వ్యక్తి కూడా రెండు ₹50 లక్షల చిట్స్‌ వేలం వేసి ఆ డబ్బు దుర్వినియోగం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.

పోలీసులు ఆరోపణలపై విచారణ ప్రారంభించి, నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

Tags:    

Similar News