Hyderabad : ఫోర్త్ సిటీలో భూముల ధరలకు రెక్కలు.. ఊపందుకుంటున్న రియల్ వ్యాపారం

హైదరాబాద్ నగరాన్ని ఎవరూ అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు.

Update: 2025-11-29 04:27 GMT

హైదరాబాద్ నగరాన్ని ఎవరూ అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు. గత కొన్ని దశాబ్దాలుగా దానంతట అదే డెవలెప్ అవుతూ నేడు ఈ స్థితికి చేరుకుంది. కోటి మందికి పైగా ఉన్న జనాభా ఉన్న నగరాల్లో ఒకటిగా చేరింది. ఇక పాలకులు కూడా తమ ముద్ర వేసుకోవడానికి హైదరాబాద్ నగరంపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. గతంలో జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ మాత్రమే ఉండేవి. కానీ 1995 తర్వాత ఐటీ పరిశ్రమ విస్తృతం కావడంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైబరాబాద్ నగరానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు అది వందల కిలోమీటర్ల మేరకు విస్తరించడమే కాకుండా సర్కార్ కు పన్నుల రూపంలో కాసులను కురిపిస్తుంది. సైబరాబాద్ లో భవనాలను చూస్తుంటే న్యూయార్క్ నగరంలో ఉన్నట్లుందని అనేక మంది చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి. కోకాపేట్ లో భూమి ఎకరా నూట డెబ్భయి ఐదు కోట్ల రూపాయలు పలికింది.

రేవంత్ సర్కార్...
ఇక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత ఫోర్త్ సిటీని ప్రతిపాదించింది. ఫోర్త్ సిటీలో అన్ని హంగులు సమకూర్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతుంది. మెట్రో సేవలను ఫోర్త్ సిటీ వరకూ విస్తరించగలిగితే దీని పరిధిలో ఉన్న ఆరు మండలాలకు మహర్దశ పట్టనుందన్నది వాస్తవం. ఇప్పటికే ఫోర్త్ సిటీ ప్రకటన చేసిన వెంటనే అక్కడ భూముల ధరలు పెరిగిపోయాయి. హైదరాబాద్ స్పెషాలిటీ ఏంటంటే కావాల్సినంత భూమి ఉంది. నగరానికి నాలుగు వైపులా విస్తరించే అవకాశమున్న ఏకైక నగరం హైదరాబాద్. అందుకే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా నిరంతరం వర్ధిల్లుతుంటుంది. ఇక్కడే ఐటీ పరిశ్రమలతో పాటు స్పోర్ట్స్ సిటీ, ఫిల్మ్ సిటీ, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలను నిర్మించాలన్నది ప్రభుత్వ నిర్ణయం.
ఈ ఆరు మండలాల్లో...
చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మహేశ్వరం, ఘట్ కేసర్, శేరిలింగంపల్లి మండలాల పరిధిలోని ప్రభుత్వ స్థలాలను సేకరించి అందులో అత్యాధునిక సౌకర్యాలతో భవన నిర్మాణాలను చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది. కొత్తగా వచ్చే ఐటీ పరిశ్రమలకు కూడా రాయితీలు ఇచ్చి ఇక్కడే భూములు కేటాయించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆయన తన హయాంలో ఫోర్త్ సిటీ రూపుదిద్దుకుంటే చరిత్రలో నిలిచపోతానని భావించి వేగంగా అడుగులు వేస్తున్నారు. గత రెండు రోజుల నుంచి ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీపై కేంద్ర మంత్రులతోనూ చర్చించారు. ఇప్పటికే ఫోర్త్ సిటీ ప్రాంతంలో భూములకు రెక్కలు వచ్చాయి. రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. అక్కడ మౌలిక సదుపాయాలను కల్పిస్తే ఖచ్చితంగా హైదరాబాద్ లో ఫోర్త్ సిటీని ఆపడం ఎవరి తరమూ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.



Tags:    

Similar News