Hyderabad : మరికాసేట్లో హైదరాబాద్ లో అతి భారీవర్షం.. అలెర్ట్ గా ఉండాల్సిందే
హైదరాబాద్ లో ఈరోజు కూడా భారీ వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్ లో ఈరోజు కూడా భారీ వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. తూర్పు అరేబియా సముద్రం దక్షిణ కొంకణ్ గోవా తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభుావతంతో రానున్న 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముందనిశైహైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 27వ తేదీన మరో అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశముందని కూడా తెలిపింది. ఈరోజు కూడా తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
బలమైన ఈదురుగాలులు...
దీంతో పాటు బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని చెప్పింది. గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది. ఉష్ణోగ్రతలు సాధారణకంటే ఐదు డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని, చల్లటి వాతావరణం ఉంటుందని తెలిపింది. తెలంగాణలోని రైతులు తమ పంట ఉత్పత్తులను భధ్రపర్చుకునే ఏర్పాట్లు చేసుకోవాలని కూడా సూచించింది. నిన్న కురిసిన వర్షానికి హైదరాబాద్ లోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వాహనాలు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి.
లోతట్టు ప్రాంతాల ప్రజలు...
ఈరోజు రాత్రికి కూడా భారీ వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ వాసులు ఈరోజు రాత్రికి కూడా అప్రమత్తంగా ఉండాలని కోరింది. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు కూడా అత్యవసర సమావేశం నిర్వహించుకుని భారీ వర్షం పడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఉన్నతాధికారులు సూచించారు. రహదారులపై నీరు నిలబడకుండా చూసుకోవాలని, జీహెచ్ఎంసీ సిబ్బంది మాత్రమే వరద నీరు పోయేలా చర్యలుతీసుకోవాలని, రోడ్డుపై డ్రైనేజీ మూతలు పౌరులు ఎవరూ తొలగించవద్దని కూడా సూచించారు. జీహెచ్ఎంసీ అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. పోలీసులు, రెవెన్యూ, హైడ్రా అధికారులతో కలసి సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించారు.