Hyderabad : హైదరాబాద్ ను ముంచెత్తిన వర్షం.. గతంలో ఎన్నడూ లేనంతగా?

హైదరాబాద్ వాసులు నేడు కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే. నేడు కూడా వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.

Update: 2025-05-22 02:09 GMT

హైదరాబాద్ వాసులు నేడు కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే. నేడు కూడా వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. నిన్న రాత్రి ప్రారంభమయిన వర్షం మూడు గంటల పాటు దంచి కొట్టింది. కుండపోత వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ వర్షపు నీటిలో చిక్కుకున్నాయి. రహదారులపైకి నీరు చేరి వాహనాల రాకపోకలకు అనేక చోట్ల అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు రాత్రంతా జాగారం చేస్తూ గడిపారు. పలు చోట్ల విద్యుత్తు సౌకర్యం లేక అవస్థలు పడ్డారు. అదే సమయంలో ఇంటర్నెట్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలుల దెబ్బకు ఇంటర్నెట్ వైర్లు తెగిపోవడంతో అనేక ప్రాంతాల్లో సేవలు నిలిచిపోయినట్లు ఫిర్యాదులు అందుతున్నాయి.

కుండపోత వాన పడటంతో...
నిన్న రాత్రి హైదరాబాద్ లో అత్యధిక వర్షపాతం నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలుచోట్ల చెట్లు, విద్యుత్తు స్థంభాలు కూడా నేలకొరిగాయి. ద్రోణితో పాటు ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్ లో కొన్ని చోట్ల మొదలయిన వర్షం ఎనిమిదన్నర గంటల ప్రాంతం నుంచి భారీ వర్షంగా మారింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతుందని ముందుగానే వాతవావరణ శాఖ హెచ్చరించింది. రెడ్ అలెర్ట్ జారీ చేసింది. వీలయినంత వరకూ ఎవరూ బయటకు రాకుండా ఉండటమే మంచిదని సూచించింది. నిన్న మధ్యాహ్నం నుంచి వాతావరణం హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిపోయింది.
నేడు కూడా భారీ వర్షం...
ఆబిడ్స్, అంబర్ పేట్, రామంతపూర్, కోఠి, దిల్ సుఖ్ నగర్, సరూర్ నగర్, ఎల్బీనగర్, మలక్ పేట్, చార్మినార్, నాంపల్లి ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, లక్డీకాపూల్, రాజ్ భవన్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో దంచి కొట్టింది. దాదాపు రెండు గంటల పాటు వర్షం పడటంతో ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయింది. నేడు కూడా భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉదయం నుంచి హైదరాబాద్ లో మేఘాలు కమ్ముకుని ఉండటంతో నేడు కూడా భారీ వర్షం పడుతుందని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రజలు వీలయినంత వరకూ బయటకు రాకుండా ఇళ్లలోనే గడపాలని అధికారులు సూచిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు, రెవెన్యూ, విద్యుత్తు, పోలీసులు సమన్వయంతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
Tags:    

Similar News