Hyderabad : మూడు గంటలు జాగ్రత్త.. ఇళ్ల నుంచి బయటకు రాకండి.. హైదరాబాదీలకు హైఅలెర్ట్

హైదరాబాద్ లో భారీ వర్షం పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది

Update: 2025-07-21 12:10 GMT

హైదరాబాద్ లో భారీ వర్షం పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరికాసేపట్లో కుండపోత వర్షం కురుస్తుందని తెలిపింది. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఎక్స్ లో అలెర్ట్ చేసింది. ప్రధానంగా హైదరాబాద్ వాసులు ఆఫీసుల నుంచి త్వరగా ఇంటికి చేరుకునే ప్రయత్నం చేయాలని, అలాగే ఇళ్లలో ఉన్న వారు రాత్రి ఎనిమిది గంటల వరకూ బయటకు రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేసింది.

ఎనిమిది గంటల వరకూ...
అవసరమైతే తప్ప వాహనాలను బయటకు తీయవద్దని, ప్రయాణాలను మానుకోవాలని కూడా సూచించింది. ఇళ్లలోనే ఉండటం క్షేమకరమని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మధ్యాహ్నం వరకూ ఎండలు దంచికొడుతుండగా, సాయంత్రం సమయానికి నల్లటి మేఘాలు కమ్ముకుంటున్నాయి. సాయంత్రం ఐదు గంటలకే కారు మబ్బులు కమ్ముకుని నగరమంతా చీకట్లు అలుముకుంటున్నాయి. అనేక చోట్ల విద్యుతు సరఫరాలకు అంతరాయం ఏర్పడింది.
లోతట్టు ప్రాంతాల ప్రజలను...
ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వీలయినంత వరకూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కూడా ఆదేశించింది. వాహనాలను కూడా ఎగువ ప్రాంతాల్లో పార్క్ చేయాలని, లేకుంటే వర్షపు నీటితో అవి మరమ్మతులకు గురయ్యే అవకాశముందని తెలిపారు. ఆఫీసుల నుంచి వీలయినంత త్వరగా ఇళ్లకు చేరుకోవాలని, లేకుంటే రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఇళ్లకు ప్రయాణం అవ్వడం సురక్షితమని తెలిపారు. రికార్డు స్థాయిలో వర్షం నమోదయ్యే అవకాశముందని కూడా హెచ్చరించారు.
తెలంగాణలోనూ...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రాత్రి వరకూ విధుల్లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ పోలీసులు కూడా నిరంతరం విధుల్లో ఉంటూ ట్రాఫిక్ వ్యవస్థను క్రమబద్దీకరించాలని కోరారు. మ్యాన్ హోల్స్ మూతలను ఎవరూ తెరవవద్దని కూడా మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల ఆదేశించారు.హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా మరి కాసేపట్లో భారీ వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాబాద్,వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది.


Tags:    

Similar News