Hyderabad : సాయంత్రం అయితే గుండెదడ... హైదరాబాద్ పై పగబట్టిన వరుణుడు
హైదరాబాద్ లో మళ్లీ కుండపోత వర్షం మొదలయింది. హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది
హైదరాబాద్ లో మళ్లీ కుండపోత వర్షం మొదలయింది. హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మొహిదీపట్నం, ఆబిడ్స్, లక్డీకాపూల్, అమీర్ పేట్, కూకట్ పల్లి, చందానగర్, మియాపూర్, పంజాగుట్ట, ఎస్.ఆర్.నగర్, ఫిల్మ్ నగర్, టోలీచౌకి, పాతబస్తీలోని చంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్ నుమా,బండ్లగూడ, ఎస్ఆర్ నగర్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, కుషాయిగూడ, ఎల్.బి.నగర్, ఉప్పల్, హయత్ నగర్, దిల్ సుఖ్ నగర్, సరూర్ నగర్,మలక్ పేట్ ప్రాంతా లలో భారీ వర్షం కురుస్తుంది. రహదారులపై భారీ వర్షం కారణంగా నీరు చేరడంతో వాహనదారులు అడుగు ముందుకు కదలలేకపోతున్నారు.
ఉదయం ఎండ... సాయంత్రానికి...
హైదరాబాద్ లో మరోసారి కుండపోత వర్షం కురస్తుంది. మరో మూడు గంటల పాటు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.ప్రజలు ఇళ్లలోనే ఉండటం శ్రేయస్కరమని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ నగర ప్రజలకు సాయంత్రం అయిందంటే గుండెదడ ప్రారంభమవుతుంది. ఉదయం నుంచి ఎండలు విపరీతంగా కాయడంతో పాటు సాయంత్రానికి మేఘాలు కమ్ముకుని వర్షం కుమ్మేస్తుంది. అరగంటసేపు నుంచి హైదరాబాద్ నగరంలో దంచి కొడుతుంది. మధ్యాహ్నం వరకూ ఉక్కపోతతో ఉన్న ప్రజలు సాయంత్రం దాటిన తర్వాత మాత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం నమోదయింది.
మూడు శాఖల అధికారులు...
దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా సంయుక్తంగా రంగంలోకి దిగాయి. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి అనేక కాలనీలు నీటమునిగాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు సాయంత్రం అయిందంటే బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తుంది. వదకుండా ప్రతిరోజూ వరుణుడు తన ప్రతాపాన్ని నగరంపై చూపడంతో నగర వీధులన్నీకర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఖచ్చితంగా కార్యాలయాలు వదిలే సమయంలోనే వర్షం కురుస్తుండటంతో విధులకు వెళ్లేవారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షానికి పలుచోట్ల విద్యుత్తు సౌకర్యానికి అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ లో నగర జీవనం అస్తవ్యస్తంగా మారింది.