ఖైరతాబాద్ వినాయకుడు ఈ ఏడాది ఎంత ఎత్తంటే?
ఖైరతాబాద్ మహాగణపతి ఈ సంవత్సరం శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శన మివ్వనున్నారు.
ఖైరతాబాద్ మహాగణపతి ఈ సంవత్సరం శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శన మివ్వనున్నారు. నిర్జల ఏకాదశి సందర్భంగా కర్రపూజ నిర్వహించి మహాగణపతి తయారీ పనులకు శ్రీకారం చుట్టారు. ఖైరతాబాద్‌లో ఈ ఏడాది వినాయక చవితికి విఘ్నేశ్వరుడు 69 అడుగుల ఎత్తులో కొలువుదీరనున్నాడు. విగ్రహం మూడు తలలతో నిల్చున్న భంగిమలో ఉంటుంది. తలపై పడగవిప్పిన ఐదు సర్పాలు, మొత్తం ఎనిమిది చేతులు ఉంటాయి.
చేతుల్లో కుడివైపు పైనుంచి ఆయుధం, సుదర్శన చక్రం, రుద్రాక్షమాల, అభయహస్తం చూపుతూ, ఎడమవైపు చేతుల్లో పైనుంచి పద్మం, శంఖం, లడ్డూ ఉంటాయి. విగ్రహం దిగువన కుడివైపు పూరీ జగన్నాథ స్వామి, ఎడమవైపు శ్రీ లలితా త్రిపురసుందరి విగ్రహాలు రూపుదిద్దుకోనున్నాయి. వినాయకుడి మండపానికి కుడివైపున ఉన్న మండపంలో దాదాపు 25 అడుగుల ఎత్తులో శ్రీలక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, ఎడమవైపు ఉన్న మండపంలో శ్రీ గజ్జలమ్మ కొలువు దీరతారు.