Hyderabad : హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. ఉన్నట్లుండి వర్షం పడటంతో విధుల నుంచి వచ్చే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. ఉన్నట్లుండి వర్షం పడటంతో విధుల నుంచి వచ్చే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారిగా వర్షం కురియడంతో రహదారిపైకి నీరు చేరి ట్రాఫిక్ స్థంభించింది. పలుచోట్ల రహదారులపై నీరు చేరి ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ప్రధానంగా మాదాపూర్, జూబ్లీహిల్స్, కొండాపూర్, కూకట్ పల్లి, అమీర్ పేట్, లక్డీకాపూల్, మొహిదీపట్నం, బంజారాహిల్స్, సికింద్రాబాద్ తో పాటు మలక్ పేట్, ఎల్బీనగర్, సరూర్ నగర్, ఉప్పల్ ప్రాంతంలో భారీ వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది.
లోతట్టు ప్రాంతాలన్నీ
భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్నీ జలమయమయ్యాయి. కొన్ని ఇళ్లలోకి నీరు చేరాయి. ఇక రహదారులపైకి నీరు చేరడంతో వాహనాలు మొరాయిస్తున్నాయి. అనేక మంది తమ వాహనాలు కదలకపోవడంతో మెకానిక్ ల వద్దకు తీసుకెళుతున్నారు. కొన్నిరహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో అక్కడి నుంచి నీరు బయటకు పంపించేందుకు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. నాలా మూతలు ఓపెన్ చేసి వాటిని కిందకు వదులుతున్నారు. ఇలా అనేక ప్రాంతంలో కొద్ది సేపు వర్ష బీభత్సం హైదరాబాద్ ను అతలాకుతలం చేసింది.
చిరు ఉద్యోగులు...
వాతావరణ శాఖ ముందే చెప్పినట్లుగా సాయంత్రానికి భారీ వర్షం కురవడంతో చిరు వ్యాపారులతో పాటు ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడ్డారు. పండ్ల వ్యాపారులు, కూరగాయలు విక్రయించే వారు తమ ఉత్పత్తులను తీసుకెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. వర్షం పడటంతో అనేక ప్రాంతాల్లో నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మాదాపూర్ నుంచి మాత్రమే కాకుండా విధుల నుంచి ఆఫీసులు వదలిపెట్టిన తర్వాత ఒక గంట కార్యాలయంలోనే వెయిట్ చేసి తర్వాత ఇంటికి బయలు దేరడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు. ఈదురుగాలులు కూడా వీయడంతో పలు చోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.