Hyderabad : హైదరాబాద్ లో భారీ వర్షం.. రహదారుల్లోకి చేరిన వర్షపు నీరు
హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుంది. సాయంత్రం ఐదున్నర గంటల నుంచి భారీ వర్షం మొదలవ్వడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు
హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుంది. సాయంత్రం ఐదున్నర గంటల నుంచి భారీ వర్షం మొదలవ్వడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సరిగ్గా కార్యాలయాలు వదిలే సమయంలో వర్షం పడటంతో రహదారులపైకి రాలేక ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. నేడు శనివారం కావడంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు సెలవు కావడంతో కొంత రద్దీ తగ్గినా మిగిలిన ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల ఉద్యోగులు వర్షంలో చిక్కుకుపోయారు. దాదాపు అరగంట నుంచి కుండపోత వర్షం కురుస్తుండటంతో అనేక రహదారులపై నీరు ప్రవహిస్తుంది. అనేక ప్రాంతాలు హైదరాబాద్ లో తడిసి ముద్దయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
ఈ ప్రాంతాల్లో భారీ వర్షం...
వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. ఈరోజు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. అయితే సాయంత్రం వేళ వర్షం కురియడంతో వీకెండ్ లో బయటకు వచ్చిన వారు తడిసి ముద్దయ్యారు. . దిల్ సుఖ్ నగర్, సరూర్ నగర్, అమీర్ పేట్, మాదాపూర్, కొండాపూర్, కూకట్ పల్లి, గచ్చిబౌలి, ఉప్పల్, రామాంతపూర్, మలక్ పేట్, ఎల్బీనగర్, సరూర్ నగర్, హయత్ నగర్, మొహిదీపట్నం, టోలీ చౌకి ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల్నీ జలమయమయ్యాయి.సాయంత్రం కావడంతో ఇంకా వాహనాలు రోడ్డు పైకి చేరుకోవడంతో ట్రాఫిక్ సమస్యలు అనేక ప్రాంతాల్లో తలెత్తి ప్రజలు మాత్రం ఇబ్బందులుపడుతున్నారు. వాహనాలు రోడ్డుపైనే మొరాయిస్తున్నాయి.
రహదారులు నీట మునిగి...
సరూర్ నగర్ లోని కొన్ని ప్రాంతాలు, దిల్ సుఖ్ నగర్ లోని పీ అండ్ టీ కాలనీ లోని కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరాయి. పలుచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి తోడు బలమైన ఈదురుగాలులు కూడా వీస్తుండటంతో విద్యుత్తు అధికారులు సరఫరాను పలుచోట్ల నిలిపేశారు. ఆగకుండా వర్షం కురవడంతో అనేక చోట్ల నగరంలో విద్యుత్తు సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినట్లుగానే ఈరోజుసాయంత్రం వర్షం పడుతుండటంతో చిరు వ్యాపారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైకి నీరు భారీగా చేరడంతో నాలా మూతలు తెరవద్దంటూ జీహెచ్ఎంసీ అధికారులు పౌరులు హెచ్చరిస్తున్నారు.