Hyderabad : వర్షం తెచ్చిన తంటా.. ఇబ్బందుల్లో హైదరాబాదీలు

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. గత రెండు గంటల నుంచి కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి.

Update: 2025-07-19 11:48 GMT

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. గత రెండు గంటల నుంచి కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రధానంగా ఉప్పల్, ఉస్మానియా యూనివర్సిటీ, విద్యానగర్, నల్లకుంట, ఎల్బీనగర్, చైతన్యపురి, దిల్ సుఖ్ నగర్, సరూర్ నగర్ , సికింద్రాబాద్, మేరేడుపల్లి, చిలకలగూడ ప్రాంతాల్లో భారీ వర్షం నమోదయింది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో విద్యాసంస్థల నుంచి బయలుదేరిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా స్కూలు బస్సులు, ఆటోలు వర్షపు నీటిలో చిక్కుకున్నాయి. రోడ్డు మీద నీరు చేరడంతో కొన్ని చోట్ల మొరాయించాయి. దీంతో వాహనాలను తోసుకుని ముందుకు రావాల్సి వచ్చింది. ఇంజిన్ లోకి నీరు పోవడంతో ద్విచక్ర వాహనాలు మొరాయించాయి.

వీకెండ్ కావడంతో...
వీకెండ్ కావడంతో హైదరాబాద్ నగరంలో ప్రయివేటు వాహనాలన్నీ బయటకు వచ్చాయి.దీంతో రహదారుల్లో ట్రాఫిక్ మరింతగా స్థంభించిపోయింది. వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. వీలయినంత వరకూ ఈరోజు కూడా బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలని, భారీ వర్షం నమోదయ్యే అవకాశముందని చెప్పింది. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరాయి. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో వస్తువులన్నీ వర్షార్పణమయ్యాయి. భారీ వర్షం కురియడంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాను అధికారులు నిలిపివేశారు. దీంతో చీకట్లు అలుముకుని నీరు బయటకు తోడుకోలేక ప్రజలు అవస్థలు పడ్డారు.
మ్యాన్ హోల్స్ మూతలు తెరిచి...
హైదరాబాద్ నగరంలో వర్షం వచ్చినప్పుడల్లా ఇదే పరిస్థితి తలెత్తుతోంది. మ్యాన్ హోల్స్ ను దుకాణ యజమానులు తీసి వేస్తుండటంతో ప్రమాదకరంగా మారింది. మ్యాన్ హోల్స్ మూతలను ఎవరూ తొలగించవద్దని, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ సిబ్బంది మాత్రమే తొలగిస్తారని, వారు తొలగిస్తే అక్కడ బోర్డులను ఏర్పాటు చేస్తారని, అప్పుడు ప్రమాదాలు జరగవని చెబుతున్నారు. అయినా కొందరు దుకాణాల యజమానులు వర్షపు నీరు తమ దుకాణాల్లోకి రాకుండా మ్యాన్ హోల్స్ తెరుస్తున్నారు. మలక్ పేట్ వద్ద రహదారిపై మ్యాన్ హోల్స్ తొలగించడంతో అక్కడ దుకాణాల యజమానులతో మున్సిపల్ సిబ్బంది గొడవకు దిగారు. కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Tags:    

Similar News