Hyderabad : కురుస్తూనే ఉన్న వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

హైదరాబాద్ లో భారీ వర్షం రాత్రి నుంచి కురుస్తూనే ఉంది. నగరం తడిసి ముద్దయింది

Update: 2025-07-26 03:18 GMT

హైదరాబాద్ లో భారీ వర్షం రాత్రి నుంచి కురుస్తూనే ఉంది. నగరం తడిసి ముద్దయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం, వాయుగుండంగా మారి తర్వాత వాయవ్య బంగళాఖాతంలోకి ప్రవేశించడంతో నిన్నటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ లో గత ఐదు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు జనం.

చిన్నపాటి వర్షం పడితేనే...
హైదరాబాద్ లో చిన్న పాటి వర్షం పడితేనే నగర రహదారులన్నీ జలమయమవుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఐదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రహదారులు చెరువుల్లా మారిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చలిగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. విద్యుత్తు వినియోగం గణనీయంగా తగ్గిందని విద్యుత్తు శాఖ అధికారులు చెబుతున్నారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని అనేక ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
ముఖ్యమంత్రి ఆదేశాలతో...
హుస్సేన్ సాగర్ కూడా నిండుకుండను తలపిస్తుంది. విధులకు వెళ్లాల్సిన ఉద్యోగులు, పాఠశాలలకు వెళ్లాల్సిన విద్యార్థులు ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రయివేటు విద్యాసంస్థలు ముందుగానే సెలవులు ప్రకటించాయి. ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. జీహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. 24 గంటలు అందుబాటులో ఉంటున్నారు. అన్ని శాఖలు సమన్వయం చేసుకుని ఎక్కడా వరద నీరు నిల్వకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు అలెర్ట్ అయ్యారు.


Tags:    

Similar News