Metro Train : మెట్రో రైలు డెడ్ స్లో.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారంతే

హైదరాబాద్ మెట్రో రైలును స్వాధీనం చేసుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఇంకా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు

Update: 2026-01-04 04:56 GMT

హైదరాబాద్ మెట్రో రైలును స్వాధీనం చేసుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఇంకా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. అందుకు అనేక కారణాలున్నాయి.అధికారుల నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్ మెట్రో రైల్‌ను స్వాధీనం చేసుకునే ప్రక్రియ నేటికీ పూర్తి కాలేదు. హైదరాబాద్ మెట్రో రైలును ఎల్ అండ్ టి కొన్నేళ్లుగా నిర్వహిస్తుంది. అయితే నష్టాలు అధికంగా వస్తున్నాయని చెప్పి తాము మెట్రో రైలు నుంచి తప్పుకుంటామని చెప్పింది. ఇందుకు ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఎల్ అండ్ టీ సంస్థ నుంచి పదిహేను వేల కోట్లు చెల్లించి కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరించారు.

టేకోవర్ చేసే ప్రక్రియ...
మెట్రోరైలును టేకోవర్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కానీ ఈ ప్రకటన చేసి నాలుగు నెలలు గడచినా టేకోవర్ నేటికీ పూర్తి కాలేదు. టేకోవర్‌ను జరిపించడానికి టెండర్ వేసి మరీ ఎంపిక చేసిన ట్రాన్సాక్షన్ అడ్వైజర్ "ఐడీబీఐ క్యాపిటల్" సంస్థకు మెట్రో రైల్, లేదా మామూలు రైల్వే టెక్నాలజీని సాంకేతికంగా మదింపు చేసే అనుభవం కానీ సామర్ధ్యం కానీ లేవని తెలిసింది. దీంతో తలపట్టుకున్న అధికారులు ఈ అంశాల్లో పూర్వ అనుభవం ఉన్న మరొక కన్సల్టెంట్ కోసం వెతుకుడుతున్నారని తెలిసింది. దీంతో మెట్రో రైలు టేకోవర్ అంశం ఇంకా నలుగుతూనే ఉంది. దీనిపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయినట్లు తెలిసింది.
మరికొంతకాలం పట్టే అవకాశం...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మూడు నెలల్లో ఎల్ అండ్ టీ నుంచి టేకోవర్ చేస్తామని నాలుగు నెలల క్రితం చెప్పినా, నిజానికి ఇప్పుడు కొత్త ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌ను ఎన్నిక చేసే ప్రక్రియనే మరో ఆరునెలలు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎల్ అండి టి సంస్థ ఎన్నో ఒప్పందాలు కుదుర్చుకుందని, అవన్నీ సరిగ్గా అధ్యయనం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేస్తే, ఆ తరువాత న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని మెట్రో ఉన్నతాధికారులు చెబుతున్నారు. మెట్రోను టెకోవర్ చేయడానికి రూ 15,000 కోట్ల డబ్బు కావాలని. అసలే ఆర్థిక పరిస్థితి సరిగ్గాలేని ఈ సమయంలో అంత డబ్బును సమకూర్చుకోవడం కూడా కష్టమేనని ఆర్థికశాఖ అధికారులు అంటున్నారు. మరి మెట్రో రైలు ప్రాజెక్టును ఎప్పటికి టేకోవర్ చేస్తారు? మెట్రో రైలు విస్తరణ పనులు ఎప్పుడు చేపడతారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే ఉంది.


Tags:    

Similar News