మద్యం సేవించి నిమజ్జనం కోసం రావద్దు

వినాయక నిమజ్జనానికి హైదరాబాద్ నగరం సిద్ధమవుతూ ఉంది. అయితే మద్యం సేవించి

Update: 2023-09-26 10:21 GMT

వినాయక నిమజ్జనానికి హైదరాబాద్ నగరం సిద్ధమవుతూ ఉంది. అయితే మద్యం సేవించి నిమజ్జనం కోసం రావద్దని హైదరాబాద్ పోలీసులు సూచించారు. రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనానికి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వినాయక చవితి ఉత్సవాల కోసం నెలరోజుల ముందు నుండే తమ సిబ్బందిని సన్నద్ధం చేశామని.. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని రోడ్ వర్క్స్, ఎలక్ట్రికల్ వర్క్స్ అన్ని పూర్తి చేశామన్నారు. గణేష్ మండప నిర్వహణతో మీటింగ్ ఏర్పాటు చేసి సలహాలు సూచనలు తీసుకున్నామని చెప్పారు.

ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నిమజ్జనం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్. 56 చెరువుల వద్ద నిమజ్జనం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు సీపీ డీఎస్ చౌహాన్. క్రేన్ ఆపరేటర్ విధిగా ఎనిమిది గంటలు డ్యూటీలో ఉండాలని.. రెండు క్రేన్లకు కలిపి అదనంగా మరో క్రేన్ ఆపరేటర్‌ను నియమించామన్నారు. ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ విషయంలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి విగ్రహానికి బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు పెద్ద విగ్రహాలకు ఒక కానిస్టేబుల్ హోంగార్డుతో భద్రత ఏర్పాటు చేశామన్నారు. కమిషనరేట్ పరిధిలో 228 పికెట్ ఏరియాలను ఏర్పాటు చేశామన్నారు. నిమజ్జనం సమయంలో మొబైల్ టాయిలెట్స్, అంబులెన్స్‌లతో పాటు మెడికల్ టీంలలో ఏర్పాటు చేశామని తెలిపారు. ఆర్టీసీ నుంచి మెకానిక్‌లు, అదనంగా డ్రైవర్లను కూడా అందుబాటులో ఉంచుతామన్నారు. మద్యం సేవించి నిమజ్జనం కోసం రావద్దని హెచ్చరించారు. వినాయక నిమజ్జనం కోసం 6,000 మంది పోలీస్ సిబ్బంది భద్రత విధుల్లో ఉంటారని, మరో వెయ్యిమంది అదనపు సిబ్బంది సిద్ధంగా ఉంటారని తెలిపారు.


Tags:    

Similar News