Sigachi Industry Accident : 43కి చేరిన పాశమైలారం మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయక చర్యలు
పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 43కి చేరింది
పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 43కి చేరింది. వరసగా చికిత్స పొందుతూ కార్మికులు మరణిస్తున్నారు. మరో తొమ్మిది మంది ఆచూకీ మాత్రం ఇంకా దొరకలేదు. వారిలో ఇద్దరు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇంకా ఏడుగురు కార్మికుల ఆచూకీ లభించాల్సి ఉందని అధికారులు తెలిపారు. సిగాచీ పరిశ్రమలో ప్రమాదం జరిగిన చోట మరొక సారి శిధిలాలను తొలగిస్తూ అవశేషాలు ఏదైనా కనిపిస్తాయేమోనని సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. మరొకవైపు పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు మృతదేహాలున్నాయి.
ఏడుగురి ఆచూకీ కోసం...
ఆ మృతదేహాలు ఎవరివన్నది మాత్రం తెలియరాలేదు. వాటి డీఎన్ఏలతో ఎవరికీ సరిపోకపోవడంతో అలాగే ఉంచారు. కుటుంబ సభ్యుల్లో రక్త నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఆ ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రమే ఆ రెండు మృతదేహాలు ఎవరివన్నది తెలియనుంది. అయితే మరొకసారి శిధిలాలను తొలగిస్తుండటంతో కొన్ని శరీర భాగాలు లభ్యమయినట్లు అధికారులు తెలిపారు. ఎముకలు, చేతివేళ్లు వంటివి మాత్రమే లభించడంతో తప్పిపోయిన ఏడుగురిలో కొందరివి అయి ఉండవచ్చన్న అనుమానాలను అధికారులు వ్యక్త చేస్తున్నారు.
సహాయక చర్యలు ...
అయితే పేలుడు జరిగిన ప్రాంతంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగించాలని నిర్ణయించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎక్కడైనాపడి పోయి ఉండవచ్చేమోనని అణువణువూ సహాయక బృందాలు గాలిస్తున్నాయి. భూమి లోపలకి ఏమైనావెళ్లాయా? అన్న అనుమానాన్ని కూడావ్యక్తం చేస్తున్నారు. హైడ్రా, ఎస్.డి.ఆర్ఎఫ్ అధికారులు ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఏదైనా ఆధారాలు లభ్యమయితే కుటుంబ సభ్యులకు అప్పగించవచ్చన్న భావనతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది.