Sidney Terror Attack : సాజిద్ అక్రమ్ హైదరాబాద్ చివరి పర్యటన 2022లో
బాండీ బీచ్ ఉగ్రదాడి కేసులో దాడి చేసిన వారిలో ఒకరైన సాజిద్ అక్రమ్ చివరిసారి 2022లో హైదరాబాద్‌కు వచ్చినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు
ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్ ఉగ్రదాడి కేసులో దాడి చేసిన వారిలో ఒకరైన సాజిద్ అక్రమ్ చివరిసారి 2022లో హైదరాబాద్‌కు వచ్చినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. అదే అతను భారత్‌కు వచ్చిన ఆరోసారి, చివరి పర్యటనగా గుర్తించారు. సుమారు 50 ఏళ్ల వయసున్న అక్రమ్‌కు హైదరాబాద్‌తో కుటుంబ సంబంధాలు ఉన్నప్పటికీ, దాడి అనంతరం అతని బంధువులు బహిరంగంగా అతనితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బాండీ బీచ్ ఉగ్రదాడి నిందితుడి చివరి హైదరాబాద్ పర్యటన 2022లో అంటే మూడేళ్ల క్రితం వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
టోలి చౌకీ నివాసిగా...
అక్రమ్ తండ్రి 2009లో మరణించగా, తల్లి, సోదరుడు ప్రస్తుతం హైదరాబాద్‌లోని టోలి చౌకీలో నివసిస్తున్నారు. ఆస్తి వ్యవహారాలపై సోదరుడితో విభేదాలు తలెత్తడంతో, హైదరాబాద్‌లో స్థిరపడే అవకాశాలు పరిశీలించేందుకే ఒకసారి పర్యటనలో ఇక్కడికి వచ్చినట్లు వర్గాలు తెలిపాయి. సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌లోని ఒకకళాశాలలో డిగ్రీ పూర్తిచేశాడు. ఆ తర్వాత విదేశాలకు వెళ్లిన అతను మధ్య మధ్యలో భారత్‌కు వస్తుండగా, 2022లో చేసిన పర్యటననే చివరిదిగా తెలంగాణ పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
తమ కుటుంబంతో సంబంధాల్లేవ్...
దాడి తర్వాత మీడియాతో మాట్లాడిన అక్రమ్ సోదరుడు, కుటుంబానికి అతనితో ఎలాంటి సంబంధం లేదన్నారు. తీవ్రవాద భావజాలం లేదా అతివాద ఆలోచనల గురించి తమకు తెలియదని చెప్పారు. కొన్ని సంవత్సరాలుగా అక్రమ్‌తో కుటుంబ సభ్యులు సంప్రదించలేదని కూడా స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్ లో జరిపిన కాల్పుల్లో పదిహేను మంది మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసు కాల్పుల్లో అక్రమ్ మరణించగా అతని కుమారుడు నవీద్ అక్రమ్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.