ఫ్యాక్ట్ చెక్: వైరల్ చిత్రం పంజాబ్-హర్యానాలో వరదల దుస్థితిని చూపడం లేదు, 2017 నాటిది

ఈ వర్షాకాలంలో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా

Update: 2025-09-05 05:35 GMT

Bihar 2017 floods

ఈ వర్షాకాలంలో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కనీసం 500 మంది మరణించారు. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, ఇళ్ళు కూలిపోవడం లాంటి ఘటనల కారణంగా డజన్ల కొద్దీ ప్రాణాలు బలయ్యాయి. చాలా ప్రాంతాల్లో రహదారులు మూసుకుపోయాయి, నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహించాయి, పంటలపై తీవ్ర ప్రభావం చూపించింది. వర్షం పలు ప్రాంతాలను ముంచెత్తుతుండడంతో వేలాది మంది చిక్కుకుపోయారు. పంజాబ్‌లోని 23 జిల్లాలన్నింటినీ వరద బాధిత ప్రాంతాలుగా ఆప్ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 1,400 గ్రామాలు మునిగిపోయాయని, 3.54 లక్షల మంది నిరాశ్రయులయ్యారని పంజాబ్ రెవెన్యూ మంత్రి హర్దీప్ సింగ్ ముండియన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు చేపడుతోంది. రావి, బియాస్, సట్లెజ్ నదులలో నీటి మట్టాలు ప్రమాదకరంగా ఉన్నాయి. కట్టలు తెగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

వరద నీటిలో మెడ లోతుకు ఈత కొడుతూ, తడిసిపోకుండా ఆహార ధాన్యాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తిని చూపించే చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇది పంజాబ్-హర్యానాలో వరద పరిస్థితిని చూపిస్తుందని వాదనతో “सैटलाइट से सिर्फ धुंआ दिखता है, तबाह होती हरियाणा की फसल और डूबता पंजाब नहीं दिखता साहब। वाहेगुरु मेहर करी “ అనే శీర్షికతో షేర్ చేస్తున్నారు.
Full View


వైరల్ పోస్టు ఆర్కైవ్ లింక్ లను ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. వైరల్ పోస్ట్‌లలో కనిపిస్తున్న చిత్రం ఇటీవలిది కాదు. ఇది 2017లో బీహార్‌లో వచ్చిన వరదలకు సంబంధించింది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి చిత్రాన్ని శోధించినప్పుడు, ఆ చిత్రం వివిధ వార్తా కథనాలలో ప్రచురించినట్లుగా మేము కనుగొన్నాము. ఇదే చిత్రాన్ని పంచుకున్న ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం, బీహార్ వరదల వల్ల 73 లక్షలకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. 72 మంది మరణించారు. ధృవీకరించని నివేదికలు 100 మందికి పైగా మరణించినట్లు పేర్కొన్నాయి. బీహార్ ప్రభుత్వం 504 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసింది, వాటిలో లక్ష మందికి పైగా వరద బాధితులు ఆశ్రయం పొందారని ఒక అధికారి తెలిపారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ, ఇంకా వేలాది మంది నిరాశ్రయులయ్యారని, బహిరంగ ప్రదేశంలో నివసిస్తున్నారని తెలిపారు. బీహార్ విపత్తు నిర్వహణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రత్యాయ అమృత్ మాట్లాడుతూ “మేము ఇప్పటికే సహాయాన్ని వేగవంతం చేసాము. వరద బాధితులకు పాలిథిన్ షీట్లను అందిస్తాము. బియ్యం, బంగాళాదుంప, పప్పుధాన్యాలు, మినుములు, అగ్గిపెట్టెలు వంటి వాటిని అందిస్తున్నాము.” అని వివరించారు.
ఆగస్టు 20, 2017న నేషనల్ హెరాల్డ్ ఇండియాలో ప్రచురితమైన ఒక వార్తా కథనం కూడా ఇదే చిత్రాన్ని పంచుకుంది.
ఆగస్టు 16, 2017న ప్రచురితమైన ఒక కథనంలో హిందూస్తాన్ టైమ్స్ కూడా ఇదే చిత్రాన్ని షేర్ చేసింది. ఈశాన్య బీహార్‌లోని వరదలతో బాధపడుతున్న అరారియా జిల్లా నుండి వచ్చిన దృశ్యమని ఆ కథనం పేర్కొంది. ఆకస్మిక వరదల కారణంగా ఏర్పడిన ఆందోళనకరమైన పరిస్థితి కారణంగా, రాష్ట్ర ప్రభుత్వం ఆర్మీ, NDRF, SDRF బృందాలతో కూడిన 50 రెస్క్యూ బృందాలను ప్రభావిత జిల్లాల్లోకి పంపింది. ఇందులో దాదాపు 2,100 మంది శిక్షణ పొందిన సిబ్బంది ఉన్నారు. అలాగే 272 పడవలను సమీప సహాయ కేంద్రాలకు తరలించడానికి పంపింది.
కనుక, వైరల్ చిత్రం ఇటీవలిది కాదు, పంజాబ్, హర్యానా వరద పరిస్థితిని చూపించదు. ఇది ఆగస్టు 2017లో బీహార్ లో సంభవించిన వరదల పరిస్థితిని చూపిస్తుంది. వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. 
Claim :  వైరల్ చిత్రం ఇటీవలి పంజాబ్-హర్యానాలో వరదల దుస్థితిని చూపిస్తుంది, అక్కడ ఒక వ్యక్తి ఆహార ధాన్యాలను నీటి నుండి కాపాడటానికి ప్రయత్నిస్తున్నాడు
Claimed By :  Social media users
Fact Check :  Unknown
Tags:    

Similar News