ఫ్యాక్ట్ చెక్: ప్రతి మున్సిపాలిటీలోనూ హైడ్రాను తీసుకుని వస్తానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించలేదు. పేపర్ క్లిప్పింగ్ ను ఎడిట్ చేశారు
ప్రతి మున్సిపాలిటీలోనూ హైడ్రాను తీసుకుని వస్తానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ నగరంలో ఆక్రమణలపై హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది. పలు ప్రాంతాల్లో చర్యలు చేపట్టింది. గచ్చిబౌలిలో ఓ విలువైన పార్కు స్థలాన్ని కాపాడగా, శామీర్‌పేటలో ఏళ్లుగా మూతపడిన రహదారికి విముక్తి కల్పించింది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అధికారులు ఈ చర్యలు చేపట్టారు. గచ్చిబౌలి టెలికాం నగర్‌లో 1982 నాటి లేఅవుట్‌లో 4000 గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. అయితే ఇందులో 1500 గజాలు ఆక్రమణకు గురై నిర్మాణాలు వెలిశాయి. మిగిలిన 2500 గజాల స్థలాన్ని కూడా కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో స్థానికులు హైడ్రా ప్రజావాణిని ఆశ్రయించారు. కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. లేఅవుట్ ప్రకారం అది పార్కు స్థలమని నిర్ధారించుకుని, 2500 గజాల స్థలంలోని ఆక్రమణలను తొలగించారు.
అయితే తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతి మున్సిపాలిటీలోనూ హైడ్రాను తీసుకుని వస్తామంటూ ప్రకటన చేశారని ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
ప్రతి మున్సిపాలిటీలో హైడ్రా: సీఎం రేవంత్ రెడ్డి
మున్సిపల్ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తే చెరువుల పక్కన ఇళ్లను కూలుస్తాం
10 లక్షల ఇల్లు కూల్చాయినా సరే లక్ష చెరువులను హైడ్రాతో కాపాడుకుంటా
మా పొంగులేటి శీనన్నకు చెప్పి ఢిల్లీ నుంచి 10వేల బుల్డోజర్లను తెప్పిస్తున్నాం
పట్టణాల్లో చెరువుల పక్కన కరకట్టలు కట్టి చెరువులను కేసీఆర్ చంపేశాడు
కరకట్టల పక్కన ఇళ్ళని కూల్చేస్తాం.. చెరువులను, పర్యావరణాన్ని కాపాడుతాం
ఖమ్మం, వరంగల్, కరీంనగర్ సిటీలలో త్వరలో హైడ్రా బుల్డోజర్లు తీసుకొస్తాం
వరదలు వస్తే ఖమ్మం మునిగింది, మునిగే ఇళ్ళని కూల్చడం తప్పేలా లేదు
ఫార్మ్ హౌస్ లో కేసీఆర్ ఉరేసుకున్న సరే.. హైడ్రాను మున్సిపాలిటిలో తీసుకొస్తా
ఖమ్మం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పట్టణాల్లో చెరువుల పరిరక్షణకు కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమకు మద్దతు ఇస్తే, చెరువుల పక్కన అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేస్తామని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. "10 లక్షల ఇళ్లు కూల్చాల్సి వచ్చినా సరే, లక్ష చెరువులను హైడ్రా ద్వారా కాపాదుకుంటా" అని సీఎం ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి అవసరమైన యంత్రాల కోసం ఢిల్లీ నుంచి 10 వేల బుల్డోజర్లను తెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు మంత్రి పొంగులేటి శ్రీనన్నతో మాట్లాడినట్లు వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టణాల్లో చెరువుల పక్కన కరకట్టలు నిర్మించి, చెరువులను నాశనం చేసిందని సీఎం ఆరోపించారు. 'కరకట్టల పేరిట చెరువులను కేసీఆర్ చంపేశారు" అని విమర్శించారు. ఇకపై కరకట్టల పక్కన నిర్మించిన ఇళ్లను కూల్చి, చెరువులు బుల్డోజర్లు రంగంలోకి దిగుతాయని తెలిపారు, వరదలు వచ్చినప్పుడు ఖమ్మం వంటి పట్టణాలు మునిగిపోతున్న మరియు పర్యావరణాన్ని కాపాడుతామని స్పష్టం చేశారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ నగరాల్లో త్వరలోనే హైడ్రా పరిస్థితిని గుర్తు చేస్తూ, మునిగే ప్రాంతాల్లో ఉన్న ఇళ్లను కూల్చడం తప్ప మరో మార్గం లేదని ఆయన అన్నారు. ఈ అంశంలో ఎలాంటి వెనకడుగు ఉండదని, తీవ్ర విమర్శలు ఎదురైనా సరే ప్రతి మున్సిపాలిటీలో హైడ్రాను తీసుకొస్తామని సీఎం దేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. అలాంటి ప్రకటన ఏదీ సీఎం రేవంత్ రెడ్డి చేయలేదు.
వైరల్ పోస్టు లోని కీలక పదాలను ఉపయోగించి మేము గూగుల్ సెర్చ్ చేశాం. అయితే సీఎం రేవంత్ రెడ్డి అలాంటి ప్రకటన చేసినట్లుగా మాకు ఎలాంటి కథనాలు లభించలేదు. అలాంటి ప్రకటన ఏదైనా రేవంత్ రెడ్డి చేసి ఉంటే అది తప్పకుండా మీడియా దృష్టిని ఆకర్షించి ఉండేది.
ఇక మేము వైరల్ పోస్టుల్లోని తేదీలో ఆంధ్రజ్యోతి దినపత్రికలో అలాంటి కథనం ఏదైనా ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం ఆ తేదీ రోజున ఈ పేపర్ ను నిశితంగా పరిశీలించాం. మాకు అలాంటి కథనం ఏదీ లభించలేదు.
ఆరోజుకు సంబంధించిన ఈ-పేపర్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఇక మా తదుపరి పరిశోధనలో తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ విభాగం సోషల్ మీడియాలో చేసిన ప్రకటన కనిపించింది. వైరల్ క్లిప్పింగ్ ను ఎడిట్ చేసి పోస్టు చేశారని వివరించింది.
"ఫేక్ న్యూస్ అలర్ట్
సోషల్ మీడియాలో ఆంధ్రజ్యోతి దినపత్రిక పేరును దుర్వినియోగం పరుస్తూ, తెలంగాణలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినట్టుగా తప్పుడు వ్యాఖ్యలను ఆపాదిస్తూ ఒక ఫేక్ న్యూస్ క్లిప్పింగ్‌ను ప్రచారం చేశారు.
అధికారిక వివరణ
అయితే, ఆంధ్రజ్యోతి అలాంటి వార్తను వారి దినపత్రిక, ఈ-పేపర్ లేదా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో, అలాగే ఏ ఎడిషన్‌లోనూ ప్రచురించలేదు. ఆ వార్త క్లిప్పింగ్ పూర్తిగా కల్పితమైనది.
అలాగే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి లేదా ఇతర అంశాలపై ఎటువంటి ప్రకటనలు కానీ వ్యాఖ్యలు కానీ చేయలేదు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారమైన వైరల్ కంటెంట్ కల్పితమైనది, తప్పుదారి పట్టించే విధంగా ఉంది. దీనికి సంబంధించి ధృవీకరించబడిన నివేదిక లేదా అధికారిక సమాచార ప్రసారంలో ఎటువంటి ఆధారం లేదు.
మీడియా సంస్థ గుర్తింపు దుర్వినియోగం
ఆ తప్పుడు సమాచారం ఆంధ్రజ్యోతి పేరును దుర్వినియోగపరుస్తూ దానిని ఒక నిజమైన వార్తగా చిత్రీకరించే ప్రయత్నం. ఇది వార్త పాఠకులను తప్పుదోవ పట్టించి ఆ ప్రముఖ వార్త పత్రిక పేరును ఉద్దేశపూర్వకంగా చెడగొట్టే ప్రయత్నం.
ప్రజలకు విజ్ఞప్తి:
దయ చేసి ప్రజలు ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మకండి. అలాగే అధికారులు చేసే ప్రకటనలను పరిశీలించండి. ఎటువంటి సమాచారమైనా సోషల్ మీడియాలో ప్రచారం చేసే ముందు దానిని నిర్ధారించుకోండి.
తప్పుడు సమాచారం ప్రచారం చేయడం వల్ల ప్రజలలో గందరగోళం ఏర్పడుతుంది. ఇలాంటి చర్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది." అంటూ పోస్టు పెట్టారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.