నేడు బెజవాడలో అన్నపూర్ణాదేవి, శ్రీశైలంలో కూష్మాండదుర్గ అలంకారాల్లో అమ్మవారు

శ్రీశైల భ్రమరాంబిక దేవి.. శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా నేడు కూష్మాండదుర్గ అలంకారంలో..

Update: 2022-09-29 00:00 GMT

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న ఆలయంలో , శ్రీశైలం మల్లిఖార్జున స్వామి ఆలయాల్లో దసరా శరన్నవరాత్రుల వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో నాల్గవరోజు అనగా నేడు విజయవాడ కనకదుర్గమ్మ అన్నపూర్ణాదేవి అలంకరణలో గంధపు రంగు లేక పసుపు రంగు చీరతో భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు అమ్మవారికి క్షీరాన్నం, దద్దోజనం, గారెలను నైవేద్యంగా సమర్పిస్తున్నారు. అన్నపూర్ణాదేవి అలంకరణ కావడంతో ఆలయం రకరకాల కూరగాయలతో అలంకరించబడుతుంది. నవరాత్రి వేడుకల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. కొండ కింది నుంచి పై వరకూ క్యూలైన్లు కిక్కిరిసి ఉంటున్నాయి.

అలాగే శ్రీశైల భ్రమరాంబిక దేవి.. శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా నేడు కూష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీశైలంలో అమ్మవారికి అలంకరణలే కాకుండా.. ఒక్కో అలంకరణ రోజు ఒక్కో వాహన సేవ నిర్వహించడం అనాదిగా వస్తోంది. నేడు అమ్మవారికి కైలాస వాహన సేవ నిర్వహిస్తారు. సాధారణంగానే రద్దీగా ఉండే శ్రీశైల క్షేత్రం.. దసరా ఉత్సవాల నేపథ్యంలో భక్తులతో కిక్కిరిసి పోతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.


 


Tags:    

Similar News