Vijayawada : నేడు శ్రీమహాలక్ష్మీదేవిగా దుర్గామాత
శరన్నవరాత్రుల్లో భాగంగా ఐదవ రోజైన శుక్రవారం ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ శ్రీమహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తుంది
శరన్నవరాత్రుల్లో భాగంగా ఐదవ రోజైన శుక్రవారం ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ శ్రీమహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తుంది. జగజ్జననీ అయిన శ్రీమహాలక్ష్మీ రూపంలో ఉన్న దుర్గామాత ఈ రోజున ఎరుపు రంగు దుస్తుల్లో భక్తులను సాక్షాత్కరిస్తుంది. "యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా" అంటే సమస్త జీవుల్లోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి.. అని చండీ సప్తశతి చెబుతోంది.
బారులు తీరిన భక్తులు...
కాబట్టి శరన్నవరాత్రుల్లో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి సర్వమంగళ కారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన భాగ్యాలను ప్రసాదిస్తుంది. శ్రీమహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చే కనకదుర్గమ్మకు ఈ రోజున నైవేద్యంగా పంచభోగాలైన పాయసం, చక్రపొంగలి, లడ్డు, పులిహోర, దద్యోజనాలను నివేదిస్తారు.ఈరోజు ఉదయం నుంచే దుర్గగుడిపై భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. దర్శనానికి గంటల సమయం పడుతుంది. క్యూ లైన్లలో ఉన్న భక్తులు ఇబ్బంది పడకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.