Ys Jagan : నేను మారాను.. నన్ను అర్ధం చేసుకోండి ప్లీజ్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు తరచూ ఒకే మాట చెబుతున్నారు. తాను మారానని అంటున్నారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు తరచూ ఒకే మాట చెబుతున్నారు. తాను మారానని అంటున్నారు. అంటే గతంలో తాను చేసిన తప్పులేమిటో ఆయన అర్ధం చేసుకునట్లే ఉంది. ఎందుకంటే మారానంటూ ఆయన ఏ నేతలతో సమావేశమైనా ఇదేరకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. నేతలకు దూరంగా ఉండటం, కార్యకర్తలతో టచ్ మీ నాట్ అంటూ వ్యవహరించడంతో పాటు ప్రజలకు కూడా దూరమై కేవలం తాడేపల్లి లోని క్యాంప్ కార్యాలయానికే ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు పనిచేశారు. అప్పుడు ఎవరి మాట చెవికెక్కించుకోలేదు. అధికారులను చుట్టూపెట్టుకుని వారు ఆడినట్లే ఆడారు. దాని ఫలితంగానే దారుణమైన ఓటమిని చవి చూడాల్సి వచ్చింది.
చుట్టూ కోటరీ...
దీంతో పాటు చుట్టూ కోటరీ కూడా జగన్ ఓటమికి కారణమయింది. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు జగన్ దృష్టికి వారు తీసుకెళ్లలేదు. అంతేకాదు.. జగన్ ఏం చెప్పినా దానికి ఊ కొట్టడమే తప్పించి అలా కాదు.. ఇలా చేస్తే బాగుంటుందన్న సలహాలు, సూచనలు చేసిన వారు కూడా లేరు. అసలు జగన్ వింటారని అనుకోలేం కానీ కానీ కనీసం ఆ ప్రయత్నం చేసిన నేతలు కూడా లేరు. అధికారంలో ఉన్నప్పుడు ఆ వ్యవహారం నడిచింది. అయితే అధికారం కోల్పోయిన తర్వాత తాను ఏం తప్పలు చేశారో ఇప్పుడు అర్థమవుతుంది. తాను తీసుకున్న నిర్ణయాలతో ఎంత మంది బాధపడ్డారు.. తన విజయం కోసం పనిచేసిన వారే ఆర్థికంగా నష్టపోయారన్న విషయం జగన్ కు ఇప్పటి కాని తెలిసి రాలేదు.
సంక్షేమ పథకాలను అమలు చేసినా...
దీంతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలను భారీ స్థాయిలో అమలు చేసినా ప్రజలు గెలిపించకపోవడానికి అనేక కారణాలున్నాయి. నలభై శాతం ఓట్లు వచ్చాయని, మూడు పార్టీలు కలవడంతోనే కూటమి గెలిచిందని నచ్చ చెప్పుకున్నప్పటికీ నాడు తాను చేసిన పనుల కారణంగానే పది శాతం ఓట్లు పూర్తిగా దూరమయ్యాయన్నది అర్థమయింది. ప్రధానంగా మధ్యతరగతి, కొన్ని సామాజికవర్గాల వారిని జగన్ కావాలని దూరం చేసుకున్నారు. ఇక అనేక చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు, కొందరు నేతలు భూ కబ్జాలకు పాల్పడుతున్నా పట్టించుకోలేదు. ఒకటి రెండు ఫిర్యాదులు వచ్చినా భూ కబ్జాలు చేసిన వారిని వెనకేసుకు వచ్చారు. దీంతో తమఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్న అభద్రత నెలకొంది.
వాలంటీర్లే అసలు సమస్యా?
మరొక వైపు వాలంటీర్లు దారుణంగా పార్టీని దెబ్బతీశారు. తాజాగా మాజీ మంత్రి గుడివాడ అమర్ నాధ్ కూడా వాలంటీర్ల వల్లనే తాము ఓడిపోయామని చెప్పారంటే జగన్ కు అర్థం కాకుండా ఉంటుందా? వాలంటీర్లే అన్నీ పనులు చేస్తుంటే కార్యకర్తలతో ప్రజలకు పనిలేకుండా పోయింది. ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు. దీంతో మరొకసారి తాను గెలుద్దామని అనుకుంటే.. వాలంటీర్లు కూడా ఎన్నికల్లో సహకరించకుండా ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. దీంతో ఓటర్లు చంద్రబాబు ఇచ్చిన హామీలకు అటు వెళ్లిపోయారు. ఇప్పుడు జగన్ మారారంటున్నారు. అధికారంలోకి వస్తే తాను కార్యకర్తలకు పెద్దపీట వేస్తానని చెబుతున్నారు. వారికి ప్రాధాన్యత ఇస్తానని అంటున్నారు. అదే సమయంలో తనను నమ్ముకున్న వారికి అన్యాయం చేయనని పదే పదే చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందన్నది భవిష్యత్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది.