Tirumala : తిరుమల శ్రీవారికి జనవరిలో రికార్డు స్థాయి ఆదాయం.. ఎంతో తెలుసా?

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతూనే ఉంది

Update: 2026-01-31 03:20 GMT

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతూనే ఉంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. గత కొద్ది రోజులుగా తిరుమల భక్తుల రద్దీతో కిటకిటలాడిపోతుంది. కొండ కిక్కిరిసిపోతుంది. గోవింద నామస్మరణలతో మారుమోగిపోతుంది. గత ఏడాది డిసెంబరు 31వ వైకుంఠ ఏకాదశి నాడు మొదలయిన రద్దీ నేడు కూడా కొనసాగుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది.

ఈ నెలలో అత్యధికంగా...
జనవరి నెలలో రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం ఉండనుంది. రోజుకు నాలుగు కోట్ల రూపాయల చొప్పున హుండీ ఆదాయం వస్తుంది. రోజుకు దాదాపు ఎనభై వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి నుంచి ఉత్తరద్వార దర్శనం చేసుకునేందుకు జనవరి మొదటి వారం వరకూ దర్శనాలు కొనసాగడంతో పాటు ఈ నెలలో వరసగా సెలవులు కూడా రావడంతో వైకుంఠవాసుని ఆదాయం గణనీయంగా పెరిగే ఛాన్స్ ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు.
పన్నెండు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని పన్నెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది నుంచి పది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం కొనుగోలు చేసిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 69,254 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 20,954 మంది తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.35 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News