మూడేళ్లుగా జగన్ సీమకు అన్యాయం
మూడేళ్లుగా ముఖ్యమంత్రి జగన్ రాయలసీమకు అన్యాయం చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు
మూడేళ్లుగా ముఖ్యమంత్రి జగన్ రాయలసీమకు అన్యాయం చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఏపీలో కుటుంబ రాజకీయ వారసత్వం పోవాలని అన్నారు. కడపలో జరుగుతున్న రాయలసీమ రణభేరి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రాయలసీమ నుంచి ఎందరో ముఖ్యమంత్రులు అయ్యారని, ఏ ఒక్కరూ సీమకు న్యాయం చేయలేదని ఆయన అభిప్రాయపడ్డారు. సీమ అన్నిరంగాల్లో వెనకబడి ఉండటానికి కారణం ముఖ్యమంత్రుల వ్యవహార శైలే కారణమని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని కిషన్ రెడ్డి చెప్పారు.
ఏం చేశారని?
ఈ సభలో పురంద్రీశ్వరి మాట్లాడుతూ రాయలసీమ నుంచి వచ్చానని చెప్పుకునే ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని చెప్పారు. ఏపీ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని ఆమె అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ సీమ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. ఒక్కసారి ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ సీమకు ఎలాంటి న్యాయం చేయలేదన్నారు. కడప స్టీల్ ప్లాంట్ ను శంకుస్థాపనలకే పరిమితం చేశారని సోము వీర్రాజు ఆరోపించారు.
వివేకా హత్య కేసులో...
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ పవన్ కల్యాణ్ చెప్పినట్లు ప్రతిపక్షాలు ఏకమై జగన్ ను గద్దె దించాలని కోరారు. శ్రీశైలం ప్రాజెక్టును కనీసం పట్టించుకోలేదన్నారు. వైఎస్ వివేకాను కుటుంబ సభ్యులే హత్య చేసి, తనమీద నెపం మోపాలని ప్రయత్నించారని చెప్పారు. ఉక్కు ఫ్యాక్టరీని జగన్ పట్టించుకోలేదన్నారు. హైకోర్టు తీర్పు ఇచ్చినా రాజధాని విషయంలో సుప్రీంకోర్టుకు జగన్ వెళుతున్నారని ఆదినారాయణరెడ్డి చెప్పారు.