Andhra Pradesh : భూ కేటాయింపుల్లో కూరుకుపోతున్న కూటమి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూ కేటాయింపులు వివాదాస్పదంగా మారుతున్నాయి.

Update: 2026-01-28 08:00 GMT

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూ కేటాయింపులు వివాదాస్పదంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికలకు ఇవి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారనున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వ భూములను తక్కువ ధరలకు కేటాయింపు చేయడం విమర్శలకు తావిస్తుంది. తాజాగా గీతం విద్యాసంస్థల యాజమాన్యానికి విశాఖపట్నంలో అప్పనంగా భూమిని కట్టబెట్టే ప్రయత్నం చేయడాన్ని కూడా విమర్శలు చేస్తున్నారు. విశాఖలో భూములకు విపరీతమైన గిరాకీ ఉంది. హైదరాబాద్ తర్వాత విశాఖపట్నంలోనే భూములకు విలువ ఎక్కువ. అటువంటి అత్యంత విలువైన భూములను కారు చౌకగా కట్టబెట్టడాన్ని ఇటు వైసీపీ, కమ్యునిస్టు పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి.

అతి తక్కువ ధరకే...
ప్రజల్లో వ్యతిరేకత అనేది ఇప్పుడు కనిపించడం లేదు కానీ.. రానున్న కాలంలో ఎన్నికల సమయంలో భూ కేటాయింపుల ఫలితం కనిపించే అవకాశాలున్నాయని టీడీపీ నేతలే అంచనా వేస్తున్నారు. ప్రముఖ ఐటీ కంపెనీలకు 99 పైసలకు ఎకరా భూమిని అప్పగించడం కూడా గతంలో విమర్శలకు దారి తీసింది. అలాగే ఉర్సా వంటి కంపెనీలకు కూడా 99 పైసలకే ఇచ్చారన్న ఆరోపణలను ప్రభుత్వం ఖండించినప్పటికీ అప్పటికే జనంలోకి ఆ ఆరోపణలు వెళ్లిపోయాయి. అమరావతి రాజధాని భూముల విషయంలోనూ కొన్ని సంస్థలకు కారు చౌకగా భూములను ఇవ్వడాన్ని కొందరు తప్పు పడుతున్నారు. ఈ మేరకు కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వం మాత్రం తాము అనుకున్న రీతిలోనే ముందుకు వెళుతుంది.
పది వేల కోట్ల విలువైన భూమి...
విశాఖపట్నంలో గీతం విద్యాసంస్థల యాజమాన్యం యాభై ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గీతం ఆక్రమించిన భూమి విలువ పది వేల కోట్ల పైనే ఉంటుందని, గీతం భూముల ఆక్రమణలపై సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. గీతం దోపిడీపై పవన్ ఎందుకు మాట్లాడటం లేదని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. విశాఖలో భూ దోపిడీపై పెద్దఎత్తున పోరాటం చేస్తామని, రేపు కబ్జా చేసిన భూమిని పరిశీలిస్తామని, 30న కౌన్సిల్లో తీర్మానానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని, అదేరోజు గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేస్తామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తెలిపారు. జీవీఎంసీలో 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేయాలన్న ప్రతిపాదనలను వెనక్కి తీసుకునేంతవరకు విపక్షాలు, మేధావులతో కలిసి పోరాటం చేయాలని నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మొత్తం మీద కూటమి ప్రభుత్వం భూ పందేరాలు వచ్చే ఎన్నికల్లో ప్రభావితం చూపుతాయన్న కామెంట్స్ ఎక్కువగా వినపడుతున్నాయి.


Tags:    

Similar News