కూటమి ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారు. అనేక ఆరోపణలు వస్తున్నా నాయకత్వాలు మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు. గతంలోనూ టీడీపీ ఎమ్మెల్యేలపై యువతులను వేధించిన ఆరోపణలు వచ్చాయి. తాజాగా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వస్తున్న ఆరోపణలతో కూటమి ప్రభుత్వం పరువు బజారున పడినట్లయింది. అందులో నిజానిజాలు ఏవైనా, వాస్తవాలు ఎలా ఉన్నా చూసే వారికి, వినే వారికి మాత్రం ఎమ్మెల్యేలపై ఒక రకమైన ఏహ్యభావం ఏర్పడుతుంది. గతంలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై ఇటువంటి ఆరోపణలు వచ్చిన వెంటనే టీడీపీ నాయకత్వం అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మరొక ఎమ్మెల్యేపై ఆరోపణలు వచ్చినా మందలించి వదిలేసింది. ఇప్పుడు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై పవన్ కల్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. కేవలం హెచ్చరించి వదిలేస్తారా? లేక పార్టీ పరంగా చర్యలు తీసుకుంటారా? అన్నది చూడాలి.
మహిళ ఉద్యోగిని...
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళ ఉద్యోగిని లైంగికంగా వేధించారన్న ఆరోపణలు ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ఆ ఉద్యోగిని వీడియో విడుదల చేసి తనను అరవ శ్రీధర్ ఎంతగా ఇబ్బంది పెట్టారో తెలియజేసింది. కొన్నేళ్లుగా తనపై లైంగిక వేధింపులు చేస్తున్నారని, తనపై అత్యాచారానికి కూడా పాల్పడ్డారని ఆ యువతి చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. తనకు ఐదు సార్లు అబార్షన్ చేయించాడని కూడా తెలిపింది. తనకు వివాహమై ఒక కుమారుడు ఉన్నప్పటికీ తనను బెదిరించి, భయపెట్టి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లొంగదీసుకున్నాడంటూ ఆ యువతి చేసిన ఆరోపణలపై జనసేన పార్టీ నాయకత్వం అంతర్గత విచారణకు ఆదేశించింది. ఈ విచారణ నివేదికను పవన్ కల్యాణ్ కు అందిన తర్వాత ఆయన ఏం చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో శ్రీకాళహస్తి జనసేన ఇన్ ఛార్జి కోట వినుత హత్య కేసులో ఇరుక్కోవడంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
పరిచయాన్ని ఆసరగా చేసుకుని...
ఫేస్‌బుక్ సాయంతో కలిగిన పరిచయాన్ని అరవ శ్రీధర్ ఆసరాగా చేసుకుని.. తనను వాడుకుని మోసం చేశారని ఆ యువతి ఆరోపించారు. తన కోరిక తీర్చకుంటే తన కొడుకును చంపేస్తానని బెదరించారని.. కారులో తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించారు. తాను గర్భం దాల్చితే అబార్షన్ చేయించుకోమని బెదిరించారని.. అంగీకరించకపోయేసరికి పెళ్లి చేసుకుంటానని నమ్మించారని అన్నారు. తన భర్తకు కూడా ఫోన్ చేసి విడాకులు ఇవ్వాలని బెదిరించారని.. ఏడాదిన్నర కాలంలో ఐదుసార్లు అబార్షన్ చేయించారంటూ సంచలన ఆరోపణలు చేశారు.దీంతో జనసేన నేతలు పెదవి విప్పకపోయినా.. అంతర్గత విచారణకు మాత్రం ఆదేశించినట్లు తెలిసింది.
కానీ తనపై కుట్ర జరిగిందంటూ...
మరి అరవ శ్రీధర్ విషయంలో పవన్ కల్యాణ్ ఎలాంటి చర్య తీసుకుంటారన్నది చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాత్రం తనకు ఏ పాపం తెలియదని చెబతున్నారు. కొందరు కావాలని తనపై కుట్ర చేసి ఆ మహిళ చేత తనపై లేనిపోని ఆరోపణలు చేయిస్తున్నారంటూ శ్రీధర్ వీడియోను విడుదల చేశారు. తాను ఆ మహిళపై గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మరొకవైపు అరవ శ్రీధర్ తల్లి ప్రమీల మాత్రం కులం పేరు చెప్పి తన కొడుకుకు దగ్గరైందని, తరచూ ఇంటికి రావడం, పగలు, రాత్రి తేడా లేకుండా ఫోన్లు చేసేదని, పెళ్లి చేసుకోవాలంటూ అనేకసార్లు బ్లాక్ మెయిల్ చేసేదని ఆరోపించారు. ఆమె వేధింపులపై ఇప్పటికే జిల్లా ఎస్పీకి సైతం ఫిర్యాదు చేశామఅని ఎమ్మెల్యే తల్లి ప్రమీల చెప్పుకొచ్చారు. మొత్తం మీద జనసేనలో అరవ శ్రీధర్ వ్యవహారం మాత్రం ఒక కుదుపు కుదిపేసింది.