TDP : రాష్ట్రమంతటా పాకేటట్లుందయ్యా... పట్టకపోతే అంటుకుంటుందేమో
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం మారలేదు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం మారలేదు. పార్టీ నేతలు కట్టుతప్పుతున్నా సరైన చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఈ ప్రభావం రాష్ట్రమంతటా కనపడుతుంది. కావలిలోనూ అక్కడి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు ఏకమయ్యారు. కావలిలో టీడీపీ నేత సుబ్బనాయుడు మృతి చెందడంతో ఈ వైషమ్యాలు ఎక్కువయ్యాయి. మాలేపాటి సుబ్బనాయుడు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఏపీ ఆగ్రోస్ కార్పొరేషన్ ఛైర్మన్ కూడా. అయితే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి, మాలేపాటి సుబ్బనాయుడుకు మధ్య పడటం లేదు. రెండు గ్రూపులున్నాయి. ఈ నేపథ్యంలో నాయుడు మరణంతో ఆయన వర్గీయులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సభలను ఏర్పాటు చేసి నేరుగా ఆయనపై విమర్శలు చేశారు. మాలేపాటి సుబ్బనాయుడు అంత్యక్రియలకు కూడా కావ్య కృష్ణారెడ్డి హాజరు కాలేదు.
మంత్రి వల్ల కాకపోవడంతో...
నెల్లూరు జిల్లాలో ఇప్పటికే గ్రూపు తగాదాలు ఎక్కువయ్యాయి. మంత్రి నారాయణ కూడా రెండు వర్గాలకు సర్దిచెప్పలేకపోతున్నారు. ఎవరినీ వెనకేసుకు రాకుండా ఎవరివైపు నిలబడకుండా నారాయణ నియోజజకవర్గాల్లో టీడీపీ నేతల మధ్య విభేదాలకు చెక్ పెట్టాలని చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు. కావలిలో రెండు గ్రూపులకు చెక్ పెట్టాలని ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం కనిపించకపోవడంతో ఈ విషయాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ వివాదానికి చెక్ పెట్టాలంటే స్వయంగా చంద్రబాబు కానీ, లోకేశ్ కాని రంగంలోకి దిగాల్సి ఉంటుంది. కానీ ఇద్దరికీ నేతల మధ్య విభేదాలను పరిష్కరించే తీరిక లేదు. ఈ నెలలో విశాఖలో జరగనున్న పార్ట్ నర్ షిప్ సమ్మిట్ పైనే ఇద్దరూ ప్రధానంగా దృష్టిపెట్టారు.
అనేక జిల్లాల్లో...
ఇటీవల నెల్లూరు అర్బన్ డెవెలెప్ మెంట్ అథారిటీ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కూడా మాఫియా డాన్ అంటూ జిల్లా నేతపై చేసిన ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న అధినాయకత్వం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి అప్పగించింది. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గొట్టిపాటి ప్రసాద్, ప్రభాకర్ చౌదరి మధ్య కూడా ఇంకా ఉప్పు, నిప్పులానే ఉంది. ఇక తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ల మధ్య రగడ కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. తాను విదేశాల నుంచి వచ్చి ఇద్దరితో మాట్లాడతానని చెప్పిన చంద్రబాబు ఆ పంచాయతీని క్రమశిక్షణ సంఘానికి అప్పగించి వెళ్లారు. రేపు ఇరువురు నేతలు క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరవుతారు. అయితే గతంలోనూ కొలికపూడి శ్రీనివాసరావు అనేక సార్లు క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరయ్యారని, ఏం జరిగిందని టీడీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు పార్టీ నేతల మధ్య విభేదాలపై దృృష్టి పెట్టకపోవడంతో అది అన్ని నియోజకవర్గాలకు అంటుకునేలా ఉందన్న ఆందోళన తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తుంది.