Chandrababu : టీడీపీ కథ మళ్లీ మొదటికి వచ్చిందా.. క్యాడర్ ఏమంటుందంటే?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే తాను 1995 ముఖ్యమంత్రిని అని ప్రకటించుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే తాను 1995 ముఖ్యమంత్రిని అని ప్రకటించుకుంటున్నారు. అయితే టీడీపీ కార్యకర్తలు మాత్రం మళ్లీ తమ కధ మొదటికే వచ్చిందని సోషల్ మీడియాలో బాధను వెళ్లగక్కుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కార్యకర్తలకు మాత్రం న్యాయం జరగడం లేదని వారు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. తమకు పదవుల విషయంలోనూ, ఇతర పనుల అంశంలోనూ అన్యాయం జరుగుతుందని తెలుగు తమ్ముళ్లు ఆక్రోశిస్తున్నారు. ఎమ్మెల్యేలు తమకు లాభం వచ్చిన వారికే అన్ని రకాలుగా ప్రయోజనాలు అందిస్తున్నారని, గత ఐదేళ్లు జెండా పట్టుకుని వైసీపీ ప్రభుత్వంలో తెగించి పోరాటం చేసినా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పట్టించుకోవడం లేదంటున్నారు.
చంద్రబాబు, లోకేష్ సమావేశమవుతున్నా...
అనేక మంది తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో ఇదే రకమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ లు జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా అక్కడ నేతలు, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. కానీ తమ అభిప్రాయాలను చెప్పుకునేందుకు అవసరమై సమయాన్ని ఇవ్వకపోవడంతో తాము నిజాలు వెల్లడించలేకపోతున్నామని కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను ప్రాణంలా చూసుకుంటానని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను పార్టీ నాయకత్వం మర్చిపోయిందని కొందరు తెలుగు తమ్ముళ్లు సూటిగా పార్టీ సోషల్ మీడియా వేదిక ద్వారానే ప్రశ్నిస్తున్నారు.
యాక్టివ్ గా లేకపోవడాన్ని...
ఇటీవల కాలంలో ప్రభుత్వం అనేక అంశాల విషయంలో వివాదాలు ఎదుర్కొన్నప్పటికీ టీడీపీ సోషల్ మీడియా యాక్టివ్ గా లేకపోవడం అందుకు నిదర్శనమని చెబుతున్నారు. మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిలో చేసిన ప్రకటన విషయంలో గాని, ములకలచెరువు కల్తీ మద్యం కేసులో టీడీపీ కార్యకర్తల నుంచి పార్టీకి అండగా స్పందన లేకపోవడాన్ని గుర్తించాలంటున్నారు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గతంలో మాదిరిగా అధికారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని ఆల్ ఈజ్ వెల్ అనుకుంటే వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు పడతామని, గ్రౌండ్ లెవెల్ రియాలిటీని తెలుసుకోవాలనుకుంటే కార్యకర్తల మనోభిప్రాయాన్ని తెలుసుకోవాలని వారు సూచిస్తున్నారు. మరి పార్టీ నాయకత్వం క్యాడర్ గోడు పట్టించుకుంటుందా? లేదా? అన్నది చూడాలి.