Ys Jagan : టీడీపీ వలలో మరో వైసీపీ ఎంపీ.. త్వరలోనే రాజీనామా ప్రకటన?

వైసీపీ నుంచి ఒక్కొక్క నేత పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. త్వరలో మరో ఎంపీ కూడా వెళ్లేందుకు సిద్ధమయ్యారని తెలిసింది

Update: 2025-05-27 08:50 GMT

వైసీపీ నుంచి ఒక్కొక్క నేత పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ముఖ్యమైన నేతలు ఇప్పటికే పార్టీని వదిలివెళ్లిపోవడంతో ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఆ ప్రభావం పడిందనే చెప్పాలి. అదే సమయంలో జగన్ వ్యవహార శైలిని నచ్చని మరికొందరు కూడా పార్టీని వీడి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. త్వరలోనే ఒక ముఖ్యనేత కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేత పార్టీకి త్వరలోనే గుడ్ బై చెప్పనున్నారని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. టీడీపీ నేతల ప్రలోభాల వల్ల కావచ్చు. లేదా జగన్ వ్యవహార శైలి ఇక మారదని భావించి పార్టీని వీడటమే మంచిదన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్లు తెలిసింది.

ఇప్పటికే అనేక మంది...
వైసీపీని ఇప్పటికే మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసులురెడ్డి, అవంతి శ్రీనివాస్ లతో పాటు సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య కూడా పార్టీని వీడారు. దీంతో పాటు విజయసాయిరెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు. ఇక ఇదే సమయంలో మోపిదేవి వెంకటరమణ నమ్మకమైన నేతగా ఉన్న ఆయన కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజ్యసభ సభ్యులు నలుగురు రాజీనామా చేసి వెళ్లిపోవడంతో ఇక ఎవరూ రాజీనామా చేసే అవకాశం లేదని చెబుతున్నారు. కానీ వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన వారిపై వరస కేసులు నమోదు అవుతుండటంతో పార్టీని వీడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
ఏడుగురు రాజ్యసభ సభ్యుల్లో...
జగన్ ను మానసికంగా దెబ్బకొట్టాలంటే వైసీపీ నుంచి అవసరం లేకపోయినా పార్టీలో తీసుకునేందుకు టీడీపీ సిద్దమయింది. ఇందులో భాగంగా మరొక రాజ్యసభ సభ్యుడికి గాలం వేసినట్లు తెలిసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజ్యసభ పదవి పొందిన వారిలో ఒకరితో టీడీపీ నేతలు టచ్ లోకి వెళ్లారని చెబుతున్నారు. ప్రస్తుతం వైసీపీలో ఏడుగురు రాజ్యసభ సభ్యులున్నారు. వారిలో వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, నిరంజన్ రెడ్డి, మేడా రఘునాధ్ రెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీలు ఉన్నారు. వీరిలో వైవీసుబ్బారెడ్డి జగన్ కు బాబాయి కావడంతో ఆయన బయటకు వెవెళ్లే అవకాశంలేదు. ఆయనకు జగన్ కీలక బాధ్యతలను పార్టీలో అప్పగించే అవకాశాలున్నాయి.
ఏడుగురిలో ఎవరు?
ఒక పిల్లి సుభాష్ చంద్రబోస్ జగన్ కు నమ్మకంగా ఉంటున్నారు. నిరంజన్ రెడ్డి, ఆళ్ల అయధ్య రామిరెడ్డి, మేడా రఘునాధరెడ్డి లు తాము పార్టీని వీడేది లేదని చెప్పారు. అయితే వైవీ తప్పించి మిగిలిన ఆరుగురిలో పరిమళ్ నత్వానీ పదవీ కాలం త్వరలోనే పూర్తవుతుంది. దీంతో మిగిలిన ఐదుగురిలో ఒకరిపై తెలుగుదేశం పార్టీ గురిపెట్టింది. వీరిలో ఒకరితో ఇప్పటికే టీడీపీలో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం అందుతుంది. రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో తిరిగి వారికే పదవి ఇస్తామని చెప్పడంతో పాటు వారి కుటుంబంలో ఒకరికి కీలక పదవి ఇస్తామని చెప్పడంతో ఆయన వైసీపీకి రాజీనామా చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.







Tags:    

Similar News