Nara Lokesh : లోకేశ్ కు ఇదే మంచి సమయమా? అందుకే ఇలా?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ క్రమంగా పార్టీ, ప్రభుత్వంపై గ్రిప్ పెంచుకుంటున్నారు.

Update: 2025-11-08 07:05 GMT

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ క్రమంగా పార్టీ, ప్రభుత్వంపై గ్రిప్ పెంచుకుంటున్నారు. ప్రతి కార్యక్రమంలో చంద్రబాబుతో సమానంగా లోకేశ్ పాల్గొంటున్నారు. మంత్రిగా ఉన్నప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడిగా లోకేశ్ భవిష్యత్ నేతగా ఎదిగేందుకు ఇదే సమయమని భావిస్తున్నట్లుంది. అందుకే ప్రతి విషయంలో ఆయన భాగస్వామ్యం కనిపించేలా చూసుకుంటున్నారు. విశాఖ పెట్టుబడుల సదస్సు నుంచి క్రీడాకారుల సన్మానం వరకూ ఏ విషయంలోనైనా చంద్రబాబు తర్వాత లోకేశ్ కు ప్రాధాన్యత కనిపిస్తుంది. దీంతో త్వరలోనే లోకేశ్ కు పట్టం కట్టే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారా? అన్న అనుమానం మాత్రం టీడీపీ నేతల్లోనే వ్యక్తమవుతుంది.

అన్నింటిలో ప్రాధాన్యత...
పొరుగున ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ తన కుమారుడికి పగ్గాలు అప్పగించలేదు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంతా తానే అయి వ్యవహరించిన కేటీఆర్ ముఖ్యమంత్రి పదవిని మాత్రం చేపట్టలేకపోయారు. అయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాత్రం చేయగలిగారు. పదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమితో పార్టీ కొంత ఇబ్బందుల్లో పడింది. అందుకే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగానే జాగ్రత్త పడాలని భావిస్తున్నట్లు కనపడుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. టీడీపీ నేతలతో సమావేశాలు, కార్యకర్తలతో మీటింగ్ లు, విదేశాలకు వెళ్లడం వంటి వాటిలో లోకేశ్ చురుగ్గా వ్యవహరిస్తుండటంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
జాతీయ స్థాయిలోనూ...
తాజాగా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న ఎన్డీఏకు మద్దతుగా నేడు బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు పాట్నా బయలుదేరి లోకేశ్ వెళుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఇలా వ్యవహరించేవారు. ఇప్పుడు తండ్రి బాధ్యతలను లోకేశ్ తాను తీసుకున్నట్లే కనిపిస్తుంది. ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులు, ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలను కలుస్తూ జాతీయ స్థాయిలో కూడా తన నాయకత్వ సామర్థ్యమేంటన్నది లోకేశ్ నిరూపించుకుంటున్నారని సీనియర్ నాయకులు అభిప్రాపడుతున్నారు. అయితే ఇప్పటికిప్పుడు వెంటనే మార్పిడి జరగకపోయినా వచ్చే ఎన్నికలకు ముందుగానే పార్టీలో కీలక మార్పులు జరిగే అవకాశముందని, ప్రభుత్వంలోనూ అనూహ్య ఘటనలు చోటు చేసుకునేందుక అవకాశాలు లేకపోలేదన్న అంచనాలు వినిపిస్తున్నాయి. లోకేశ్ చేతికి అంది రావడంతో చంద్రబాబు కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు.


Tags:    

Similar News