Ys Jagan : ఓటమి తర్వాత జగన్ లో ఇంతటి మార్పు వచ్చిందా?

గత ఎన్నికలలో తెచ్చిన ఓటమి వైసీపీ అధినేత జగన్ లో మార్పు తెచ్చినట్లు కనపడుతుంది

Update: 2026-01-27 11:21 GMT

గత ఎన్నికలలో తెచ్చిన ఓటమి వైసీపీ అధినేత జగన్ లో మార్పు తెచ్చినట్లు కనపడుతుంది. వైసీపీ అధికారంలోకి రాకముందు, తర్వాత కూడా జగన్ ను నేరుగా కార్యకర్తలను కలిసే అవకాశముండేది కాదు. ఏదైనా జిల్లాల పర్యటనలకు వచ్చినప్పుడు మాత్రమే అదీ వాహనంలో ఉండి పలకరింపులు తప్పించి జగన్ ను ముఖ్య కార్యకర్తలు నేరుగా కలిసే అవకాశముండేది కాదు. ఇక 2019 నుంచి 2024 వరకూ అధికారంలో ఉన్న సమయంలో జగన్ నేతలను, ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా కలిసేవారు కాదు. ఆయన చుట్టూ ఉన్న కోటరీ నేతలను కలవనివ్వకుండా చేసేదని సాక్షాత్తూ విజయసాయిరెడ్డి లాంటి నేతలే బయటకు వచ్చిన తర్వాత ఆరోపణలు చేశారు.

ఎప్పుడు వచ్చినా...
అయితే జగన్ ఓటమి తర్వాత కొంత మార్పు వచ్చినట్లు కనపడుతుంది. ఇప్పుడు జగన్ బెంగళూరు నుంచి తాడేపల్లికి ఎప్పుడు వచ్చిన నేతలతో పాటు ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలకు కూడా ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తున్నారు. వారితో ముచ్చటిస్తున్నారు. కార్యకర్తలతో ఫొటోలు దిగుతున్నారు. ఓటమి తర్వాత ఇప్పటికే బెంగళూరుకు మకాం మార్చిన జగన్ నెలలో రెండు సార్లు తాడేపల్లికి వస్తారు. ఆయన వస్తారని రాష్ట్రం నలుమూలల నుంచివచ్చిన వారిని నిరాశపర్చకుండా జగన్ వారితో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. వారి వ్యక్తిగత సమస్యలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. దీంతో క్యాడర్ లో భరోసా నింపే అవకాశముంటుందని ఆయన భావించి కార్యకర్తలకు కలుసుకునే అవకాశం కల్పించారు.
మూడేళ్ల సమయమే ఉండటంతో..
కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత వరసగా కార్యకర్తలపై కేసులు నమోదవుతుండటం, ఇక ఎన్నికలకు మూడేళ్లు మాత్రమే సమయం ఉండటంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరుగుతుండటంతో కార్యకర్తలు ఖచ్చితంగా పార్టీ విజయానికి దోహదపడతారని ఆయన గుర్తించినట్లుంది. అందుకే గత కొన్నేళ్లుగా దూరం పెట్టిన కార్యకర్తల భుజం పైన చేతులు వేసి మరీ ఫొటోలు దిగుతున్నారంటే ఖచ్చితంగా జగన్ లో మార్పు వచ్చిందంటున్నారు. ఇక నేతలయితే ఎలాంటి అపాయింట్ మెంట్ లేకపోయినా అప్పటికప్పుడు కలవాలన్నావెళ్లి కలిసే వీలు కల్పించారు. దీంతో క్యాడర్ నుంచి లీడర్ల వరకూ జగన్ లో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోతున్నారట. ఇదే పరిస్థితి భవిష్యత్ లోనూ కొనసాగాలని కోరుకుంటున్నారు.


Tags:    

Similar News