Nara Lokesh : నారా లోకేశ్ కు రోడ్ మ్యాప్ ను చంద్రబాబు సిద్ధం చేశారా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తనయుడు లోకేశ్ కోసం రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తనయుడు లోకేశ్ కోసం రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. చంద్రబాబు ఒక మార్గాన్ని ఏర్పరుస్తున్నట్లు కనపడుతుంది. రహదారిని ఏర్పాటు చేసి లోకేశ్ రాజకీయ ప్రయాణానికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఎక్కువగా చంద్రబాబు ఈ టర్మ్ లో కనిపిస్తుంది. గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో చంద్రబాబు నాయుడులో ఈ ఆలోచన లేదు. ఆయన మదిలోకి కూడా రాలేదు. కానీ లోకేశ్ చేతికి అందిరావడంతో తన కళ్ల ముందే కుమారుడిని అందలం ఎక్కించాలన్నది కన్నతండ్రి తాపత్రయం చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తుంది. లోకేశ్ ను ప్రజల్లోకి పంపడమే కాకుండా ఆయనకు రాజకీయాల్లో ఎత్తుపల్లాలను గురించి ప్రాక్టికల్స్ గా ఈ ఐదేళ్ల కాలం ఉపయోగించేటట్లే కనపడుతుంది.
పార్టీ కార్యక్రమాల విషయంలో...
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల విషయంలో లోకేశ్ దే పైచేయి కనిపిస్తుంది. లోకేశ్ కు ప్రత్యేక టీం ఉంది. ఆయన పార్టీ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తూ కార్యకర్తలతో పాటు పార్టీ నేతలను కూడా గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తలలో జోష్ నింపుతూనే వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవసరమైన అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. టీడీపీ ముఖ్య కార్యకర్త కు ఏ ఆపద వచ్చినా వెంటనే లోకేశ్ క్షణంలో సోషల్ మీడియాలో స్పందించడమే కాకుండా ఆపదలో ఉన్న వారికి వెంటనే సాయాన్ని కూడా ప్రకటిస్తున్నారు. తాను స్వయంగా ప్రకటించడమే కాకుండా స్థానిక నేతలను పురమాయించి కార్యకర్తలను ఆదుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.
టీడీపీ మంత్రులతో కూడా...
ఇక మంత్రివర్గ సమావేశం ప్రారంభానికి ముందు టీడీపీకి చెందిన మంత్రులతో లోకేశ్ గత కొన్ని దఫాలుగా ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. వారితో మంత్రివర్గ భేటీ కంటే ముందుగా మాట్లాడుతున్నారు. ఒకరకంగా మినీ కేబినెట్ మీటింగ్ లోకేశ్ నిర్వహిస్తున్నారని పార్టీకి చెందిన నేతలే అంటున్నారు. కూటమిలోని మిత్ర పక్షాలకుచెందిన మంత్రులను ఈ సమావేశాలకు పిలవకపోయినా అత్యధిక సంఖ్యలో ఉన్న తన పార్టీకి చెందిన మంత్రులతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికైతే ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఒక క్లారిటీ మాత్రం వచ్చేసింది. లోకేశ్ నేరుగానే ఆదేశాలు జారీ చేస్తుండటంతో త్వరలోనే ఆయన అందలం ఎక్కడం ఖాయమన్న కామెంట్స్ సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి.
ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ కూడా...
ఇటీవల లోకేశ్ తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తుండటం, కేంద్ర మంత్రులతో సమావేశాలు, మోదీ, అమిత్ షాలతో భేటీలు వంటి వాటితో మరింతగా రాజకీయాలను అందిపుచ్చుకునేలా చంద్రబాబు నాయుడు అవకాశం కల్పిస్తున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు ముంందు కూడా లోకేశ్ ఢిల్లీకి వెళ్లడం, పార్టీ ఎంపీలతో కలసి మాట్లాడటం వంటివి ఈ తరహాలోనివే. కార్యకర్తలకు, పార్టీ నేతలకు, మంత్రులకు, ఎంపీలకు అయితే ఒక క్లారిటీ వచ్చింది. వచ్చే ఎన్నికల వరకూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆయన నాయకత్వంలోనే వెళతారంటున్నారు. అదే వచ్చే ఎన్నికల్లో తిరిగి కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తే మాత్రం ఖచ్చితంగా నారా లోకేశ్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టడం ఖాయమన్న అభిప్రాయం ఇప్పుడు పార్టీలో మార్మోగుతుంది. అందుకే ఇప్పటి నుంచే టీడీపీ అంతా లోకేశ్ చుట్టూ తిరుగుతుండటానికి అదే కారణమన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.