Chandrababu Naidu : చంద్రబాబు వార్నింగ్ లను డోన్ట్ కేర్ అంటున్న నేతలెవరు? టీడీపీలో హాట్ టాపిక్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వంపై వచ్చే విమర్శలకునేతలు స్పందించడం లేదు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వంపై వచ్చే విమర్శలకునేతలు స్పందించడం లేదు. నిజంగా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, అధికార పార్టీ ప్రతినిధులు యాక్టివ్ గా లేకపోవడానికి కారణాలేంటి? అన్నదానిపై పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఏడాది కాలమే అయింది. అయినా సరే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చాలా వరకూ చంద్రబాబు గ్రౌండ్ చేశారు. ప్రతి నెల ఒకటో తేదీన ఆయన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొంటున్నారు. లబ్దిదారుల ఇళ్లకు వెళుతున్నారు. అదే సమయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో కూడా చంద్రబాబు సమావేశమవుతున్నారు.
సొంత నియోజకవర్గంలో...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో పాటు, అనేక అభివృద్ధి పనులకు సంబంధించిన విషయాలను పదే పదే ప్రస్తావిస్తున్నప్పటికీ నేతలకు మాత్రం చీమకుట్టినట్లయినా లేదన్న టాక్ పార్టీలో బలంగా వినిపిస్తుంది. కేవలం ఒకరిద్దరు మంత్రులు, కొందరు నాయకులు మాత్రమే వైసీపీ విమర్శలకు రియాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న విమర్శలపై కూడా నేతలు స్పందించడం లేదు. ఉదాహరణకు ఇటీవల చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించారు. కుప్పం నియోజకవర్గానికి హంద్రీనీవా నీటిని విడుదల చేశారు. అయితే వైసీపీ సోషల్ మీడియాలో ఇది సినిమా సెట్టింగ్ అని, చంద్రబాబు వెళ్లి పోయిన తర్వాత నీరు మాయమయిందన్న పోస్టింగ్ లు పెద్దయెత్తున కనిపించాయి. బోయపాటి శ్రీను ఫొటోతో రూపొందించిన పోస్టింగ్ లు వైరల్ అయ్యాయి.
చిత్తూరు జిల్లా నేతలు కూడా...
అయినా చిత్తూరు జిల్లా నేతలు ఎవరూ దీనిపై ఖండించలేదు. అదే సమయంలో యూరియా కొరతపై ఈ నెల 9వ తేదీన వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమానికి దిగుతుంది. కానీ టీడీపీ నుంచి ఎవరూ పెద్దగా స్పందించలేదు. అంతెందుకు ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రెండు రోజుల క్రితమే దీనిపై స్పందించారు. మిగిలిన మంత్రులు కూడా యూరియా కొరత లేదని చెప్పే ప్రయత్నం చేయలేదు. దీంతో పాటు సూపర్ సిక్స్ హామీలపై కూడా వైసీపీ విమర్శలు చేస్తున్నా అందుకు ధీటుగా నేతలు స్పందించడం లేదు. చంద్రబాబు నాయుడు పదే పదే హెచ్చరిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. మంత్రులు, అధికార ప్రతినిధులు, నేతల్లో నిరాసక్తతకు గల కారణాలేంటన్నది అంతుచిక్కకుండా ఉందంటున్నారు టీడీపీ అభిమానులు. ఇప్పటికైనా చంద్రబాబు హెచ్చరికలు పనిచేస్తాయా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.