Chandrababu : సీనియర్లే బెస్ట్ అనిపిస్తుందా.. ఈతరం నేతలను గాడిన తేవడం కష్టమేనా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు సీనియర్ నేతల విలువ తెలిసి వచ్చినట్లుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు సీనియర్ నేతల విలువ తెలిసి వచ్చినట్లుంది. జూనియర్ ఎమ్మెల్యేలతో పడుతున్న అవస్థలు చూసి సీనియర్లే నయం అనిపించేలా చంద్రబాబు మాటలు ఉన్నాయి. గత కొంతకాలంగా ఎమ్మెల్యేలు వరస వివాదాలతో చిక్కుకోవడం తో పాటు అందులో ఎక్కువ మంది తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయిన వారు ఉండటంతో గతంలో లేని తలనొప్పులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయన్న విషయం చంద్రబాబుకు అర్థమయినట్లుంది. అందుకే సీనియర్ నేతల విలువ ఆయనకు తెలిసిందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. సీనియర్ నేతలకు ఉన్న అనుభవంతో పాటు వారికి ప్రజల్లో ఉన్న పట్టు ఈతరం నేతలకు లేకపోవడానికి అనేక కారణాలున్నాయని చంద్రబాబు గుర్తించారు.
కార్యకర్తలను విస్మరిస్తూ...
ఒకసారి ఎమ్మెల్యే గా గెలిచిన వెంటనే తాను నియోజకవర్గానికి మోనార్క్ అయిపోయినట్లు వ్యవహరిస్తూ తన విజయం కోసం పనిచేసిన పార్టీ కార్యకర్తలను పట్టించుకోకుండా నియోజకవర్గంలో అన్ని విషయాల్లో వేలుపెడుతూ వివాదాల్లో చిక్కుకోవడంతో పాటు ఇగోలకు పోవడంతో పాటు, సోషల్ మీడియాలో వారి వ్యవహార శైలి కూడా పార్టీకి ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్యేలు కొందరు ప్రొటోకాల్ తెలుసుకోకుండానే అధికారులతో ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగుతుండటాన్ని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రస్తావిస్తున్నారు. అలాంటి వివాదాలను గతంలో సీనియర్ నేతలు ఎవరికీ రాకపోవడాన్ని కూడా గుర్తుంచుకోవాలంటున్నారు.
కొత్తతరానికి అవకాశమివ్వాలని...
పార్టీకి కొత్త రక్తం కావాలని యువతకు పెద్దపీట వేయాలని, కొత్తతరానికి రాజకీయాల్లో అవకాశం కల్పించాలని తాను నిర్ణయం తీసుకుంటే.. కూటమి కారణంగా గెలిచిన ఎమ్మెల్యేలు గెలుపు తమదేనని విర్రవీగుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటున్నారు. ఇసుక, మద్యం విషయాల్లోనూ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ల నియోజకవర్గాల్లోనే రచ్చకెక్కడాన్ని ఆయన గుర్తు చేసుకుంటున్నారు. అనుభవం లేకుంటే పెద్దలను చూసి తెలుసుకోవాలి. పది కాలాల పాటు తాము ఆ నియోజకవర్గంలో గెలిచేందుకు అవసరమైన రోడ్ మ్యాప్ ను గెలిచిన రోజు నుంచి రూపొందించుకోవాల్సిన సమయంలో ఎమ్మెల్యేలు ఇలా వ్యవహరించడంతో చంద్రబాబుకు తత్వం బోధపడిందని తెలిపింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు పార్టీకి అండగా నిలబడకపోగా, విపక్షాల విమర్శలపై స్పందించకపోగా, వివాదాలబారిన పడుతుండటం చంద్రబాబును పునరాలోచనలో పడిందనే చెప్పాలి.