Andhra Pradesh : అన్నదాతలు.. ప్రతి ఏడాది బలిపశువు కావాల్సిందేనా?
ఆంధ్రప్రదేశ్ లో అన్నదాతలు అల్లాడిపోతున్నారు. మొంథా తుపాను రైతులను పూర్తిగా ముంచేసింది
ఆంధ్రప్రదేశ్ లో అన్నదాతలు అల్లాడిపోతున్నారు. మొంథా తుపాను రైతులను పూర్తిగా ముంచేసింది. దాదాపు ఇరవై ఐదు జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. లక్షాలాది ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయాయి. వరి, పత్తి, వేరుశెనగ, మొక్కజొన్న, మిర్చి వంటి పంటలతో పాటు అరటి, బొప్పాయి, కంద వంటి పంటలను సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వ నష్టం అంచనాలే వ్యవసాయానికి 829 కోట్ల రూపాయలుగా అంచనా వేసింది. ప్రభుత్వ అంచనాలే ఇలా ఉంటే అంతకు మించి నష్టం జరిగి ఉంటుందని ఖచ్చితంగా అనుకోవాలి. ఎకరానికి వేల రూపాయలు పెట్టుబడిపెట్టిన రైతులు పంటలు పూర్తిగా కోల్పోవడంతో వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనాలు వినిపిస్తున్నాయి.
పరిహారం విషయంలో...
ప్రభుత్వం కూడా రైతులకు పూర్తి పరిహారాన్ని అందిచడం కష్టమే. అయితే అన్నదాతను ఆదుకోవడం ప్రభుత్వం విధి. కానీ తూతూ మంత్రంగా వారికి పరిహారం అందించినంత మాత్రాన వారిని ఆదుకున్నట్లు కాదు. వారి బతుకులకు భరోసా కల్పించినట్లు కాదు. ప్రభుత్వ పరంగా అవసరమైన పరిహారం అందించడంతో పాటు వారికి పంటల బీమా పకడ్బందీగా అమలు చేస్తేనే వారికి సరైన రీతిలో ఆర్థికంగా అండ దక్కుతుంది. లేకపోతే అన్నదాతలు బతికున్నా చచ్చిన శవాలతో సమానమేనని అనుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కు తరచూ తుపానులు వస్తుంటాయి. అకాల వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు ఎప్పుడూ పొంచి ఉంటుంది. అలాంటి సమయంలో ప్రభుత్వం కేవలం ప్రాణాలను రక్షించామని జబ్బలు చర్చుకోవడం కాదు.
బతికి ప్రయోజనం ఏంటి?
బతికున్నా జీవచ్ఛవాలుగా రైతన్నలను మార్చకుండా అవసరమైన అన్ని చర్యలు అన్నదాతల విషయంలో తీసుకోవాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో కొంత సాయం అందిస్తుంది. అదే సమయంలో రైతన్నలను పూర్తి స్థాయిలో ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ప్రతి ఒక్కరికీ అన్నం పెట్టే రైతును విస్మరిస్తే రానున్న కాలంలో అందరూ కష్టాలను ఎదుర్కొనాల్సి వస్తుంది. మిగిలిన అభివృద్ధి పనులకన్నా కర్షకుల సంక్షేమమే దేశానికైనా, రాష్ట్రానికైనా ముఖ్యం. కంటితుడుపు చర్యగా వారికి పరిహారం పేరిట తూతూ మంత్రంగా చేస్తే ఇక పంటలను వేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవచ్చు. వ్యవసాయం దండగ అనే భావన రైతుల మదిలో మెదలకముందే పాలకులు మేల్కొనాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇంత వరకూ పరిహారంపై ప్రకటన చేయకపోవడం అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు.