Andhra Pradesh : ఏపీ రైతులకు గుడ్ న్యూస్... ఇక వారి "పంట" పండినట్లే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది
ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఇరవై నెలలు కావస్తుంది. ఈ ఇరవై నెలల్లో సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంతో పాటు అభివృద్ధిని కూడా వేగంగా తీసుకెళుతుంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ భాగస్వామిగా ఉండటంతో నిధుల విషయంలోనూ, ప్రాజెక్టుల మంజూరులోనూ ఒక అడుగు ముందులోనే ఉంది. ఇక త్వరలో ఏపీలోనూ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈఎన్నికల్లో కూటమి వన్ సైడ్ విజయం సాధించాలంటే అసంతృప్తిగా ఉన్న వర్గాలను దగ్గర చేసుకోవాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ప్రధానంగా రైతులు అన్నదాత సుఖీభవ పథకం అందిస్తున్నా పంటలకు సరైన గిట్టుబాటు ధర లేదని కొంత రైతులు అసహనంతో ఉన్నారు.
రైతులకు ఉపయోగపడేలా...
రైతుల కోసం ప్రత్యేకంగా మరొక కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. ఇది రైతులకు ఉపయోగపడేలా డిజైన్ చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్టపికే దీనిపై ఒక ప్రకటన కూడా చేశారు. ప్రస్తుతం ప్రజలు అనేక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. అందుకు ఆహారం కూడా ఒక కారణం. అనారోగ్యానికి పురుగు మందులు వాడిన ధాన్యం, పండ్లు వంటివి తినడం వల్ల వస్తున్నాయి. అందుకే కాస్త ఖరీదయినా ఎక్కువ మంది నాణ్యత కలిగిన ఆహారాన్ని కోరుకుంటున్నారు. వ్యాధుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులకు ఎంత ధర చెల్లించేందుకు అయినా వెనకాడటం లేదు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్గానిక్ వ్యవసాయాన్ని రాష్ట్రంలో ప్రోత్సహించాలని నిర్ణయించారు. రైతులకు అవసరమైన శిక్షణ కూడా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఎగుమతులతో మంచి లాభాలు...
ప్రకృతి వ్యవసాయానికి ప్రధమ ప్రాధాన్యత ఇచ్చేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలను కూడా అందివ్వాలని నిర్ణయించింది. దీనివల్ల ఆ ఉత్పత్తుల సరైన ధరలు రావడమే కాకుండా, వెనువెంటనే ఎగుమతులు కూడా ఉంటాయని రైతుల్లో విస్తృత ప్రచారాన్ని కల్పించనున్నారు. పెద్దగా ఖర్చులేకుండానే ఆర్గానిక్ వ్యవసాయం చేయవచ్చు. అయితే ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పద్దెనిమిది లక్షల మంది ఆర్గానిక్ ఫార్మింగ్ కు ముందుకు వచ్చారు. వారికి ప్రభుత్వ క్వాలిటీ సర్టిఫికెట్ ఇవ్వనుంది. అంతేకాకుండా ప్రోత్సాహకాలు కూడా అందించనుంది. కేవలం వ్యవసాయ ఉత్పత్తులే కాకుండా ఆక్వా, మత్స్య సంపద మీద ఆధారపడే వారు కూడా ఇదే సూత్రాన్నిపాటిస్తే ఎగుమతులు భారీగా అవుతాయని, తద్వారా రైతులకు మాత్రమే కాకుండా రాష్ట్రానికి కూడా ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. ఇందుకోసం నలభై లక్షల మంది రైతులను సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు ఆర్గానిక్ సేద్యాన్ని ఇష్టపడే రైతులను గుర్తించే పనిలో పడ్డారు.