Telangana : రైతులకు తీపి కబురు.. ఖాతాల్లో నగదు పడేది ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. బకాయీలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తెలంగాణలోని మొక్క జొన్న రైతులకు భారీ ఊరట లభించినట్లయింది. త్వరలోనే మొక్కజొన్న రైతులకు సంబంధించిన బకాయీలు విడుదల కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడంతో పాటు సంబంధిత శాఖకునిధులను కూడా విడుదల చేసింది. దీంతో త్వరలోనే మొక్కజొన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
అర్హులైన అందరికీ...
అర్హులైన మొక్కజొన్నరైతులందరికీ ఈ బకాయీలను చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత వానాకాలంలో రైతుల నుంచి మొక్కజొన్నను ప్రభుత్వం సేకరించింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తమ వద్ద ఉన్న మొక్క జొన్న పంటను విక్రయించారు. అయితే ఇప్పటివరకూ మొక్కజొన్నను కొనుగోలు చేసిన ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తమ బకాయీలు ఎప్పుడిస్తారంటూ ఆవేదనతో ఎదురు చూపులు చూస్తున్నారు.
నిధులను విడుదల చేసి...
దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో 171 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. మార్క్ ఫెడ్ ద్వారా రైతుల ఖాతాల్లో బకాయీలను త్వరలోనే జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. గత సీజన్ లో రైతుల నుంచి 3.77 లక్షల టన్నుల మొక్క జొన్న పంటను కొనుగోలు చేశామని, మొత్తం సుమమారు 78 వేల మంది రైతులు తమ పంటను విక్రయించారని అధికారులు తెలిపారు. ఇప్పటికే తొలి దశలో ఈ పంట కొనుగోలుకు సంబంధించి 735 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా 171 కోట్లు విడుదల చేయడంతో రైతుల ఖాతాల్లో బకాయీల నగదు జమ కానుంది. ప్రభుత్వం ఉత్తర్వులు, నిధులు విడుదల చేయడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.